న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరెస్టయి జైల్లో ఉన్న ఎన్‌సీపీ నేత, మాజీ మంత్రి నవాబ్ మాలిక్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. మనీలాండరింగ్ కేసులో మహ్మద్ నవాబ్ మహ్మద్ ఇస్లాం మాలిక్, ఆయన కుటుంబ సభ్యులు, సొలిడస్ సంస్థ, మాలిక్ ఇన్‌ఫ్రా సంస్థల ఆస్తులను పీఎంఎల్ చట్టం కింద అటాచ్ చేశామని ఈడీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలోని గోవావాలా కాంపౌండ్, వాణిజ్య సముదాయం, మూడు ఫ్లాట్లు, రెండు నివాస ఫ్లాట్లు, ఒస్మానాబాద్ జిల్లాలోని 147.79 ఎకరాల భూమిని అటాచ్ చేసినట్లు పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో మాలిక్‌ను ఈడీ ఫిబ్రవరిలో అరెస్టు చేసింది.
విచారణకు సుప్రీం ఓకే
మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసి జైల్లో ఉంచిన తనను తక్షణం విడుదల చేయాలని కోరుతూ నవాబ్ మాలిక్ చేసిన అభ్యర్ధనపై విచారణకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. మాలిక్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ చేసిన అభ్యర్థనపై సీజేఐ జస్టిస్ రమణ ఆధ్వర్యంలోని బెంచ్ పరిశీలించి, సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాలని సూచించింది. పీఎంఎల్ చట్టం 2005లో అమల్లోకి వచ్చిందని, కానీ తన క్లయింటును 2000 సంవత్సరానికి ముందు జరిగిన నేరానికి పీఎంఎల్‌ఏ కింద అరెస్టు చేశారని సిబాల్ వాదించారు. అంతకుముందు ఆయన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో మాలిక్ సుప్రీంను ఆశ్రయించారు. మాలిక్ విడుదల అభ్యర్థనను పీఎంఎల్‌ఏ కోర్టు కొట్టివేయడంలో తప్పులేదని, అలాగే ఆయన్ను రిమాండ్‌కు పంపడంలో కూడా ఎలాంటి తప్పు జరగలేదని, అందువల్ల జైలు నుంచి విడుదల చేయాలన్న మాలిక్ కోరికను తిరస్కరిస్తున్నామని హైకోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment