బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల ఉందనగా.. కర్ణాటక బీజేపీలో రెబల్ సెగ తాకే సూచనలు అందుతున్నాయి. ఈ మేరకు పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ సీఎం జగదీష్ షెట్లర్.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలో దిగనున్నట్లు సంకేతాలు అందించారు. పార్టీ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారాయన.
హుబ్బళ్లి(హుబ్లీ-ధార్వాడ్) నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన షెట్టర్‌కు ఈసారి టికెట్ విషయంలో బీజేపీ ప్రతికూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న పార్టీ అధిష్టానం నుంచి పిలుపు అందుకున్న ఆయన.. ఇవాళ మీడియా ముందు తన అసహనం ప్రదర్శించారు.
నేను బీజేపీ అధిష్టానాన్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను.. నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ప్రతీసారి 21 వేల ఓట్లకు పైచిలుకు ఆధిక్యంతో నెగ్గాను. నా కెరీర్‌లో ఎటువంటి మచ్చ లేదు. ఎలాంటి ఆరోపణలు లేవు. అలాంటప్పుడు నన్ను తప్పుకోమని, వేరే వాళ్లకు అవకాశం ఇవ్వమని ఎలా అడుగుతారు?. అందుకే నన్ను పోటీకి అనుమతించాలని, లేకుంటే పార్టీకి మేలు జరగదు అని ఆయన మీడియా ఎదుట అసంతృప్తిగా మాట్లాడుతూ వెళ్లిపోయారు.
ఒకవేళ పోటీకి అనుమతించకుంటే మాత్రం.. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతారా? అనే ప్రశ్నకు.. దానికి సమాధానం బీజేపీ అధిష్టాన నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. బీజేపీ పట్ల విధేయతతో కొనసాగుతున్నా. తాజా సర్వేలు కూడా నా విజయావకాశాలను ధృవీకరించాయి. కానీ, అధిష్టానం నుంచి నాకు అందిన పిలుపు నన్ను నిరాశకు గురి చేసింది. టికెట్ ఇవ్వకుంటే కచ్చితంగా ఇండిపెండెంట్ క్యాండిడెట్‌గా ఎన్నికల్లో పోటీ చేస్తా అని తెలిపారాయన.
జగదీష్ శివప్ప షెట్టర్.. కర్ణాటకకు 15వ ముఖ్యమంత్రిగా(2012-13 మధ్య) పని చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. న్యాయవాద వృత్తిలో 20 ఏళ్లు కొనసాగి.. ఆపై రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అసెంబ్లీ స్పీకర్‌గా, ఆపై యడియూరప్ప కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. కర్ణాటక బీజేపీ సంక్షోభంతో 2012 నుంచి ఏడాదిపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సీఎం అభ్యర్థిగా నిల్చున్న ఆయన.. పార్టీ నైతిక ఓటమి తర్వాత ప్రతిపక్ష నేతగా కొనసాగారు.
కర్ణాటక ఎన్నికల కోసం బీజేపీ ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు. పార్టీ ఎన్నికల సంఘం ఈ వారంతంలో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో పాటు పార్టీ కీలక నేతలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటించవచ్చని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఈశ్వరప్ప ఇక పోటీ చేయరట!
Comments
Please login to add a commentAdd a comment