
న్యూఢిల్లీ: హోరాహోరీగా సాగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠం టీఎంసీ, బీజేపీ మధ్య దోబూచులాడుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్య గట్టిపోటీ నెలకొందని, నువ్వా–నేనా అన్నట్లుగా పరి స్థితి ఉందని గురువారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియా టుడే– యాక్సిస్ సర్వే బీజేపీకి 134–160 సీట్లు, టీఎంసీకి 130–156 సీట్ల దాకా వస్తాయని తెలిపింది. అయితే మిగతా పలు చానల్స్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ అతికష్టం మీద సాధారణ మెజారిటీ (147) కంటే కొద్దిసీట్లు ఎక్కువ సాధిస్తారని పేర్కొన్నాయి.
ఇక తమిళనాడులో ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ల కజగం (డీఎంకే) ఘన విజయం సాధించబోతోందని తేల్చాయి. ఎగ్జిట్ పోల్స్‌ను బట్టి చూస్తే... అస్సాంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయంగా కనపడుతోంది. కేరళలోనూ సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కూటమి సంప్రదాయాన్ని తోసిరాజని వరుసగా రెండోసారి అధికారంలోకి రానున్న ట్లు స్పష్టమవుతోంది. మొత్తానికి ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం సాధిస్తామని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. పుదుచ్చేరిలోనూ అధికారం కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెంగాల్‌లో ఉనికి కోసం పాట్లు పడుతోంది.
అందరి దృష్టి బెంగాల్ పైనే...
బెంగాల్‌లో లెఫ్ట్ కంచుకోటలను బద్దలుకొట్టి 2011, 2016లలో వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన దీదీ గట్టిపట్టు సాధించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం 42 సీట్లలో బీజేపీ దాదాపు 40 శాతానికి పైగా ఓట్లతో 18 లోక్‌సభ సీట్లను సాధించింది. దాంతో గత రెండేళ్లుగా కమలనాథులు బెంగాల్‌పై గురిపెట్టి... ఇంకా బలపడే ప్రయత్నం చేస్తూ వచ్చారు. దీంట్లో భాగంగా తృణమూల్ ముఖ్యనేతలను పలువురిని బీజేపీలోకి ఆకర్షించారు. మమత కుడిభుజమైన సువేందు అధికారి కొద్దినెలల కిందట బీజేపీ గూటికి చేరడంతో బెం గాల్ రాజకీయం వేడెక్కింది. మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగ్గా... ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు పలుమార్లు బెంగాల్‌ను చుట్టివచ్చారు. మమత లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టి... ముప్పేటదాడి చేశారు. ఫలితంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలను నెగ్గిన బీజేపీ ఇప్పుడు అధికారపీఠానికి దగ్గరగా వచ్చేంతగా ఎదిగింది.
ఇండియా టుడే– యాక్సిస్ సర్వే బీజేపీకి 134–160, టీఎంసీకి 130–156 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్– సీఎన్‌ఎక్స్ కూడా కొంచెం అటుఇటుగా బీజేపీకే అధికస్థానాలు వస్తాయని తేల్చింది. అయితే టైమ్స్ నౌ– సీ ఓటర్, ఏబీపీ– సీ ఓటర్ ఎగ్జిట్‌పోల్స్ మాత్రం తృణమూల్ సాధారణ మెజారిటీ సాధిస్తుందని, 150 పైచిలుకు స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పాయి. ముప్పేటదాడి జరుగుతున్నా... ఏమాత్రం వెరవకుండా ఒంటరిపోరాటం చేసిన దీదీకి స్వల్పమొగ్గు ఉంటుందని ఈ రెండు సంస్థలు తేల్చాయి. ఎగ్జిట్‌పోల్స్ ఓటరు నాడిని ఏమేరకు ప్రతిఫలిస్తాయో చూడాలి. సువేందు అధికారితో మమత నేరుగా తలపడ్డ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో గట్టిపోటీ ఉందని, విజయం ఎవరిని వరిస్తుందో అంచనా వేయడం కష్టమని పలు సంస్థలు పేర్కొన్నాయి. మరోవైపు వామపక్షాలు– కాంగ్రెస్ కూటమి దారుణంగా దెబ్బతిననుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ తేల్చిచెప్పాయి. ఈ రెండు పార్టీలకు కలిపి గరిష్టంగా 25 సీట్లు... కనిష్టంగా 2 సీట్లు వస్తాయని లెక్కగట్టాయి. ఒకవేళ తృణమూల్, బీజేపీలలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే అప్పుడీ కూటమి కీలకమయ్యే అవకాశాలుంటాయి.
తమిళనాడులో డీఎంకే హవా
మొదటిసారిగా అమ్మ జయలలిత లేకుండా ఎన్నికలను ఎదుర్కొన్న అన్నాడీఎంకే (బీజేపీతో జతకట్టి) దారుణంగా దెబ్బతిని అధికారం కోల్పోనుందని అన్ని ఎగ్జిట్‌పోల్స్ ముక్తకంఠంతో చెప్పాయి. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (మిత్రపక్షం కాంగ్రెస్) ఏకపక్ష విజయంతో అధికారం చేపట్టనుందని ఇండియా టుడే– యాక్సిస్ తెలిపింది. డీఎంకే కూటమికి 175–195 స్థానాలు వస్తాయని, అన్నాడీఎంకే కూటమి 38 నుంచి 54 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. టైమ్స్ నౌ– సీ ఓటర్, రిపబ్లిక్– సీఎన్‌ఎక్స్‌తో సహా అన్ని సంస్థలూ డీఎంకే భారీ విజయం ఖాయమని చెప్పాయి. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 118 సీట్లు అవసరం కాగా... అన్ని ఎగ్జిట్‌పోల్స్ కూడా డీఎంకే కూటమికి కనిష్టంగా 160, అంతకుపైనే స్థానాలు వస్తాయని పేర్కొనడం గమనార్హం.
అస్సాంలో వరుసగా రెండోసారి...
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఇండియా టుడే– యాక్సిస్ తెలిపింది. బీజేపీ కూటమికి 75–85 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 40 నుంచి 50 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఎన్నికల్లో నష్టం జరగకూడదనే ఉద్దేశంలో అస్సాంలో బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండా వ్యూహత్మకంగా వ్యవహరించింది. ఇది సత్ఫలితాలను ఇచ్చినట్లే కనపడుతోంది. శర్వానంద సోనోవాల్ (ప్రస్తుత సీఎం), హిమంత బిశ్వ శర్మలు ఇక్కడ బీజేపీ గెలిస్తే సీఎం కుర్చీకి గట్టిపోటీదారులు కానున్నారు. టైమ్స్ నౌ– సీ ఓటర్, రిపబ్లిక్– సీఎన్‌ఎక్స్‌తో సహా అన్ని సంస్థలూ బీజేపీకే మొగ్గు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇక కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కూటమిని ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి భారీ ఆధిక్యంతో అధికారంలోకి తేనున్నారని ఇండియా టుడే– యాక్సిస్ తెలిపింది.
ఎల్‌డీఎఫ్‌కు ఏకంగా 104– 120 స్థానాలు వస్తాయంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ఎల్‌డీఎఫ్‌కు సాధారణ మెజారిటీ (71) కంటే ఎక్కవే సీట్లు వస్తాయని ప్రతి సంస్థా చెప్పడం గమనార్హం. ప్రతి ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చే అలవాటున్న కేరళ ఓటర్లు ఈసారి అందుకు భిన్నమైన తీర్పును ఇచ్చారనేది ఎగ్జిట్‌పోల్స్‌ను బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కేవలం 20–36 స్థానాలకే పరిమితం అవుతుందని ఇండియా టుడే– యాక్సిస్ పేర్కొనగా... మిగతా సంస్థలు ఈ కూటమికి 50 పైచిలుకు స్థానాలు వస్తాయని పేర్కొనడం గమనార్హం. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్‌ఆర్ కాంగ్రెస్– బీజేపీ– అన్నాడీఎంకే కూటమి అధికారం చేపట్టే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment