మహాకుంభ్ నగర్(యూపీ): ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళా ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం చోటుచేసుకున్న ఘటనలో రెండు కార్లు దగ్ధమయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వారణాసికి చెందిన ఓ కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ఫైర్ అధికారి వివరించారు. అందులోని వారందరినీ కాపాడి, మంటలను వెంటనే అదుపులోకి తెచ్చామన్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ఈ నెల 19న మహాకుంభ్ నగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 18 క్యాంపులు భస్మీపటలమయ్యాయి. మంటలను సకాలంలో ఆర్పివేయడంతో ప్రాణనష్టం తప్పింది.
ఒకటిన 73 దేశాల దౌత్యవేత్తల రాక
రష్యా, ఉక్రెయిన్ సహా 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు మహాకుంభ్ మేళాలో మొదటిసారిగా పుణ్యస్నానాలు చేయనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన వీరంతా రానున్నారని మేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కోసం విదేశాంగ శాఖ యూపీ చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాసిందన్నారు. జపాన్, అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్, కామెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోలండ్, బొలీవియా తదితర దేశాల దౌత్యాధికారులు పాల్గొంటారని చెప్పారు. బోట్‌లో సంగం వద్దకు చేరుకుని పుణ్యస్నానాలు చేస్తారన్నారు. అనంతరం, అక్షయ్‌వట్, బడే హనుమాన్ ఆలయాలను దర్శించుకోనున్నారు. డిజిటల్ మహాకుంభ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో వీరికి మహాకుంభ్ ప్రాశస్త్యాన్ని వివరించనున్నామన్నారు.
సొంత అఖాడాకు సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రయాగ్‌రాజ్‌లోని తన సొంత శ్రీ గురు గోరక్షా నాథ్ అఖాడాను సందర్శించారు. ధర్మ ధ్వజ్‌కు స్వయంగా ఉత్సవ పూజ జరిపారు. ఈ సందర్భంగా సీఎం యోగి దేశం నలుమూలల నుంచి మహాకుంభ్‌కు విచ్చేసిన సిద్ధ యోగులతో చర్చలు జరిపారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది గురు గోరక్షా నాథ్ సంప్రదాయాన్ని కొనసాగించే సీఎం యోగి సొంత అఖాడా అని యోగి మహాసభ ప్రత్యేక ఉపాధ్యక్షుడు మహంత్ బాలక్ నాథ్ యోగి చెప్పారు. యోగుల బసకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment