సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశమైన మనాలీకి ఏటా వేలాది మంది టూరిస్టులు వెళ్తుంటారు. ఈ క్రమంలో పర్యటకులకు వినూత్న అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది అక్కడి అంకుర సంస్థ. ఎత్తయిన ప్రాంతంలో గాలిలో ఊగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మహా ఊయల (జెయింట్ స్వింగ్) జనవరి నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. కృత్రిమ మేథ (ఏఐ)తో పనిచేసే ఈ జెయింట్ స్వింగ్‌ను ఐఐటీ మండీ వద్ద ఏర్పాటైన ‘మనాలీ స్వింగ్’ అంకుర సంస్థ రూపొందించింది. ప్రపంచంలోనే ఇలాంటి తరహా ఊయల ఇదే మొదటిదని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
పర్వతారోహణపై ఆసక్తి ఉండి, సాహసాలను ఇష్టపడే నలుగురు ఇంజినీరింగ్ మిత్రులు ఈ అంకుర సంస్థను స్థాపించారు. ఈ ఊయల ఆకృతి, కాన్సెప్టులపై 5 పేటెంట్లు పొందేందుకు అవసరమైన ప్రక్రియను కూడా వీరు ప్రారంభించారు. దుబాయ్, స్విట్జర్లాండ్ ప్రాంతాల్లో దీని ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. పర్యాటకులు రూ.3,000 చెల్లిస్తే.. రవాణా ఛార్జీలు, ఫొటో, వీడియోలకు అయ్యే ఖర్చులన్నీ అందులో కలిసే ఉంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment