కె.శ్రీకాంత్‌రావు, సాక్షి ప్రత్యేక ప్రతినిధి
దేశంలో గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదం అవుతోంది. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోని వ్యక్తులను గవర్నర్లుగా నియమిస్తుండటంతో.. వారు తమ పూర్వాశ్రమ వాసనలు వదిలిపెట్టలేక పోతున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలనా వ్యవహారాల్లో తలదూరుస్తుండటంతో గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ నాయకులను గవర్నర్లుగా నియమిస్తుండటం, తద్వారా రాష్ట్రాలపై పెత్తనం ఉండేలా చూసుకోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలోని ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ఏవీ కూడా దీనికి అతీతం కాదు. మరీ గతంలో మాదిరిగా గవర్నర్లు ఆర్టికల్ 356ను వినియోగించి ప్రభుత్వాలను రద్దు చేయకున్నా.. అడ్డంకులు సృష్టించడం, బహిరంగంగా ప్రభుత్వ విధానంపై వ్యాఖ్యానాలు చేయడం జరుగుతోంది.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తాత్సారం చేయడమూ కనిపిస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు గవర్నర్లు తమకు లేని అధికారాన్ని పాలనలో చూపించాలని యత్నించినప్పుడు వివాదాలు వస్తున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల నిర్ణయాలను గవర్నర్లు విచక్షణాధికారం పేరిట మోకాలడ్డుతుండటంతో అసలు గవర్నర్ల వ్యవస్థపైనే విమర్శలు వస్తున్నాయి. గవర్నర్ల వ్యవస్థ హద్దులు దాటనంత వరకు మంచిదేనని, రాజ్యాంగ పరిరక్షణకు వారు పరిమితమైతే మంచిదని న్యాయ నిపుణులు అంటున్నారు.
గవర్నర్ల మితిమీరిన జోక్యమే ఆ వ్యవస్థ నష్టమని ప్రతిపక్షాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. గవర్నర్లను నియమించే వ్యవస్థలో పారదర్శకత కోసం ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఎంపిక కమిటీ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలూ ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ల వ్యవస్థకు సంబంధించి సర్కారియా కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేస్తే ప్రయోజనం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఎప్పటి నుంచో వివాదాలు
1984లో నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను గవర్నర్ రామ్‌లాల్ అనైతికంగా పదవీచ్యుతుడిని చేసి నాదెండ్ల భాస్కర్‌రావును సీఎంగా చేసిన సందర్భంలో గవర్నర్ల వ్యవహారశైలిపై తీవ్ర దుమారం చెలరేగింది. అప్పట్లో పెద్దఎత్తున జరిగిన ఆందోళనతో దిగివచ్చిన కేంద్రం తిరిగి ఎన్టీఆర్‌ను సీఎంగా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా గవర్నర్ల వ్యవస్థపై రద్దు కోసం పోరాటం చేశారు.
2013లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ కూడా ఆ రాష్ట్ర గవర్నర్‌ను రీకాల్ చేయాలని, ఢిల్లీ సుల్తాన్‌ల మనిషిగా గవర్నర్ ఇక్కడ ఉన్నారని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లపాటు ఖాళీగా ఉన్న గుజరాత్ లోకాయుక్తను అప్పటి గవర్నర్ కమలా బెనీవాల్ నియమించడంతో వివాదం రేగింది. దానితో ఆగ్రహించిన మోదీ.. లోకాయుక్త నియామకంలో గవర్నర్ పాత్ర లేకుండా ముఖ్యమంత్రి, మంత్రివర్గమే తుది నిర్ణయం తీసుకునేలా బిల్లు పాస్ చేయించారు. ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ ఏ నిర్ణయమైనా ముఖ్యమంత్రి, మంత్రివర్గం చేసిన సలహా మేరకే తీసుకోవాలని స్పష్టం చేశారు.
గవర్నర్లు ఆనవాయితీ పాటిస్తేనే మంచిది
రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన అధికార కేంద్రాలు రెండు ఉండవు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే పూర్తి అధికారం. గవర్నర్‌ది రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత మాత్రమే. దానిని అర్థం చేసుకొని మెలగాలి. గవర్నర్ ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞకు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞకు మధ్య తేడాను గుర్తించాలి. రాజ్యాంగాన్ని, న్యాయాన్ని ప్రిజర్వింగ్, డిఫెండింగ్, ప్రొటెక్టింగ్ అన్నది మాత్రమే గవర్నర్ విధి. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే సలహాలు ఇచ్చి సరిచేయాలి.
ఏవైనా అనుమానాలుంటే ముఖ్యమంత్రిని పిలిచి క్లోజ్డ్ డోర్‌లో నివృత్తి చేసుకోవాలి. అనుమానాలను నివృత్తి చేయడం ముఖ్యమంత్రి బాధ్యత కూడా. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు హద్దులు దాటుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు. పాలనాపరంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా మంత్రి వర్గమే అసెంబ్లీకి, ప్రజలకు జవాబుదారీ. గవర్నర్‌కు ఎలాంటి జవాబుదారీతనం లేదు. ఇటీవలికాలంలో ప్రభుత్వాలకు, గవర్నర్ వ్యవస్థకు మధ్య జరుగుతున్న వివాదాలు చూస్తుంటే.. రెండువైపులా పెద్దరికం అనేది లేకుండా పోయింది. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై గవర్నర్లు బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయడం సరికాదు. రాజ్యాంగం, సంప్రదాయాలు, ఆనవాయితీలను ఇరువైపులా పాటిస్తే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు.
– సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
బిల్లులు ఆపడం సరికాదు
రాజ్యాంగ బద్ధమైన ఒకటి రెండు అంశాల్లో తప్ప రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. కేబినెట్ ఆమోదం తెలిపిన బిల్లులను ఆపడం, మంత్రులను పిలిచి వివరణ కోరడం సరికాదు. అసెంబ్లీ ప్రొరోగ్ అనేది స్పీకర్‌కు సంబంధించిన అంశం. గవర్నర్లు సమస్యలపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరవచ్చు. అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. కానీ నేరుగా అధికారులకే ఆదేశాలు జారీ చేయకూడదు. ఇది సమాంతర ప్రభుత్వాన్ని నడిపినట్లే అవుతుంది.
– కె.రామకృష్ణారెడ్డి, హైకోర్టు సీనియర్ న్యాయవాది
గవర్నర్ కేబినెట్ నిర్ణయాల మేరకే నడుచుకోవాలి
ప్రజాస్వామ్యంలో పరిపాలనకు సంబంధించి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే తుది నిర్ణయం. కేబినెట్ నిర్ణయాలను ఆపడానికి, రద్దు చేయడానికి గవర్నర్‌కు అధికారం లేదు. నేరుగా పాలనలో కలగజేసుకోకూడదు. సభ జరగనప్పుడు మాత్రమే కొన్ని నిర్ణయాలను తీసుకోవచ్చు. అదీ అప్పుడున్న కేబినెట్ అనుమతితోనే తీసుకోవాలి. గతంలో ఏర్పాటైన ఓ కమిషన్ కూడా తన నివేదికలో ఇదే అంశాన్ని చెప్పింది. ఇక అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుండా నడపడం అనేది స్పీకర్‌కు సంబంధించిన అంశం. అందులోనూ గవర్నర్ పాత్ర ఉండదు.
– సత్యప్రసాద్, హైకోర్టు సీనియర్ న్యాయవాది
తాజా సంఘటనలకు వస్తే..
►కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లను మూకుమ్మడిగా తొలగించడం ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌కు ఆగ్రహం తెప్పించింది. గవర్నర్‌కు వర్సిటీల చాన్సలర్ హోదాను తొలగిస్తూ మంత్రివర్గం ఆర్డినెన్స్‌ను ఆమోదించి గవర్నర్‌కు పంపింది. చిత్రమేమిటంటే ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం చేస్తే తప్ప అది అమల్లోకి రాదు. తనను తాను చాన్స్‌లర్ పదవి నుంచి తొలగించుకోవడం ఇష్టం లేని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ దానిని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఆ రాష్ట్రంలో తరచూ గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య ఏదో ఒక అంశంపై వివాదం రగులుతూనే ఉంది.
►పశ్చిమబెంగాల్‌లో కొంతకాలం కిందటి వరకు మమత సర్కారుకు, నాటి గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే సాగింది. బహిరంగంగానే విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగింది.
►తమిళనాడు విషయానికి వస్తే.. అక్కడి శాసనసభ ‘నీట్’ నుంచి తమ రాష్ట్ర విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలంటూ బిల్లును పాస్ చేసింది. దానిని రాష్ట్రపతికి పంపకుండా గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆపి.. తిరిగి శాసనసభకు పంపారు. దీనిపై ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గవర్నర్ సనాతన ధర్మాన్ని పొగడటంపైనా స్టాలిన్, డీఎంకే పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనను తక్షణమే రీకాల్ చేయాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. స్టాలిన్‌కు, గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
►తెలంగాణలో రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించకుండా గవర్నర్ తమిళిసై ఆపడంతో మొదలైన వివాదం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని గవర్నర్ చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల సమయంలో రాజ్‌భవన్‌కు సీఎం, మంత్రులు రాకపోవడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడం, అసెంబ్లీ ప్రోరోగ్ చేయకుండా కొనసాగించడం వంటివాటితో వివాదాలు కొనసాగాయి.
గత వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ఆమోదిస్తే.. అందులో ఒక్క జీఎస్టీ బిల్లు మినహా మిగతా ఏడు బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియమకాలకు సంబంధించి ‘తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బిల్లు’పై గవర్నర్ అనుమానాలు వ్యక్తం చేయడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు వెళ్లి వివరణ ఇచ్చారు. ఆ బిల్లుకు ఇంకా ఆమోదం తెలపలేదు. గవర్నర్ విలేకరుల సమావేశంలోనే ప్రగతిభవన్ (సీఎం) గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.
►మహారాష్ట్రలో మహావికాస్ అగాడి (ఎంవీఏ) కూటమి అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీతో విభేదాలు కొనసాగాయి. ఆయన మంత్రివర్గం సిఫార్సు చేసిన అంశాలను ఆమోదించకుండా విచక్షణాధికారం పేరిట కాలయాపన చేశారు. ఏ సభలోనూ సభ్యుడు కాని ఉద్ధవ్‌ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనమండలికి నామినేట్ చేయాలని మంత్రివర్గం సిఫార్సు చేసింది. కానీ దీనిని నాలుగు నెలల పాటు ఆమోదించకుండా వివాదం రేపారు.
Comments
Please login to add a commentAdd a comment