పంజాబ్‌, హర్యానాలో టెన్షన్‌.. రోడ్లపై బారికేడ్లు, ఇనుప కంచెలు.. | Haryana Prepares To Block Farmers Parliament March | Sakshi
Sakshi News home page

పంజాబ్‌, హర్యానాలో టెన్షన్‌.. రోడ్లపై బారికేడ్లు, ఇనుప కంచెలు..

Published Sun, Feb 11 2024 8:39 AM | Last Updated on Sun, Feb 11 2024 8:39 AM

Haryana Prepares To Block Farmers Parliament March - Sakshi

చంఢీగఢ్‌: పంజాబ్‌, హర్యానాలో మరోసారి టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. రైతులు ‘చలో పార్లమెంట్‌’ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే హర్యానా ప్రభుత్వం మొబైల్‌ ఇంటర్నెట్‌, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లపై ఆంక్షలు విధించింది. మరోవైపు.. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. 

వివరాల ప్రకారం.. అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడానికి చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో రైతుల పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో రైతులు చలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 13న పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో, హర్యానాలోని ఏడు జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అంబాలా, కురుక్షేత్ర, కైథల్, జింధ్, హిస్సార్, ఫతేహబాద్, సిర్సా జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. 

అలాగే, ఏడు జిల్లాల పరిధిలో ఒకేసారి భారీగా ఎస్ఎంఎస్‌లు పంపడంపై ఈ నెల 11 ఉదయం ఆరు గంటల నుంచి 13 రాత్రి 12 గంటల వరకూ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దులు మూసివేసేందుకు హర్యానా పోలీసులు సిద్ధం అయ్యారు. కాగా, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో సుమారు 200 రైతు సంఘాలు ఢిల్లీకి మార్చ్‌ నిర్వహించనున్నాయి. మరోవైపు, ట్రాక్టర్ ర్యాలీతో వచ్చే రైతులను అడ్డుకునేందుకు అంబాలా జిల్లాలోని రహదారులపై పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో, హర్యానా ప్రభుత్వ తీరును రైతు సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement