ఏక భాష వద్దు.. ‘నాకు హిందీ తెలియదు’ | Hindi Imposition: Strong Reactions From States And Organisations | Sakshi
Sakshi News home page

ఏక భాష వద్దు.. ‘నాకు హిందీ తెలియదు’

Published Thu, Apr 14 2022 8:14 PM | Last Updated on Thu, Apr 14 2022 8:30 PM

Hindi Imposition: Strong Reactions From States And Organisations - Sakshi

ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని, స్థానిక భాషలను కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న వాదన తెరపైకి వచ్చింది. 

గత వారం న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్‌ షా మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యకలాపాలు అధికార భాషలో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారని, ఇది కచ్చితంగా హిందీ ప్రాముఖ్యతను పెంచుతుందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు హిందీని విస్తరించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

‘వివిధ రాష్ట్రాల పౌరులు కమ్యూనికేట్ చేసేటప్పుడు అది భారతదేశ భాషలో ఉండాలి. అదే సమయంలో ప్రాంతీయ భాషల నుంచి పదాలను ఇముడ్చుకునేందుకు అనువుగా హిందీని మార్చాల’ని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. హిందీ ఎక్కువగా మాట్లాడేవారు ఉంటే.. అది దేశాన్ని ఒక్కటిగా ఉంచుతుందన్న భావన కలుగుతుందని అన్నారు. 

ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 10వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసోం, బెంగాల్‌, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ సహా పలు రాష్ట్రాల నాయకులు దీనిపై స్పందించారు. భాషాపరమైన ఆధిపత్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలను ఏకం చేసే పేరుతో హిందీని అందరిపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని  ఆరోపించారు. 

హిందీని బలవంతంగా రుద్దడం మానుకుని.. స్థానిక భాషలను పరిరక్షించడం, ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని అసోం సాహిత్య సభ కోరింది. తమిళనాడు నుంచి డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఈ చర్య దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని డీఎంకే పేర్కొంది. భారతీయుడని నిరూపించుకోవడానికి హిందీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని తమిళనాడు బీజేపీ నేతలు అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా మోదీ సర్కారు చర్యను తప్పుబట్టింది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని తెలిపారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ బలంగా గళం వినిపించారు. 

హిందీని తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సోషల్‌ మీడియాలో #StopHindiImposition హాష్‌ట్యాగ్‌తో ప్రచారం చేశారు. ‘నాకు హిందీ తెలియదు’ అనేది కూడా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌, సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ వంటి సెలబ్రిటీలు కూడా ట్విటర్‌ వేదికగా తమ నిరసన వ్యక్తం చేశారు. (క్లిక్: నన్ను పట్టించుకోవడం లేదు.. కొత్త పెళ్లికొడుకులా ఉన్నా..)

కేవలం హిందీ భాష ద్వారా మాత్రమే భారతదేశానికి గుర్తింపు వస్తుందన్న కేంద్రం వాదనలో పస లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్ మినహా ప్రతి రాష్ట్రానికి స్వంత భాష ఉందని వెల్లడించారు. అలాంటప్పుడు హిందీ భాషను అన్ని రాష్ట్రాలపై రుద్దడం సరికాదని అంటున్నారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదని.. సంస్కృతి, గుర్తింపు కూడానని వివరించారు. భాషా వైవిధ్యాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఏక భాష విధానం సమర్థనీయం కాదని స్పష్టం చేస్తున్నారు. (క్లిక్: ఆరెస్సెస్‌ అలాంటిది కాదని ఆయనకు చెప్పా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement