వయనాడ్‌ విధ్వంసం.. కుటుంబాన్ని రక్షించేందుకు అధికారుల సాహసం | How Wayanad Forest Officers Overcame Rain Rocky Terrain To Save Family, Watch Video And Photos Inside | Sakshi
Sakshi News home page

వయనాడ్‌ విధ్వంసం.. కుటుంబాన్ని రక్షించేందుకు అధికారులు ప్రాణాలకు తెగించి..

Published Sat, Aug 3 2024 2:00 PM | Last Updated on Sat, Aug 3 2024 4:46 PM

How Wayanad forest officers overcame rain rocky terrain to save family

కేరళలోని వయనాడ్‌ విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం కొండచరియలు విరిగిపడిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ప్రకృతి విలయంలో మరణించిన వారి సంఖ్య 358కు చేరుకుంది.  మృతుల సంఖ్య ఇంకా పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయిదో రోజు సెర్చ్‌, రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇంకా వందలాది మంది ఆచూకీ తెలియాల్సి ఉంది, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు, జగిలాలను ఉపయోగించి గల్లంతైన వారి ఆచూకీని కనిపెట్టే  ప్రయత్నం చేస్తున్నారు. కాగా వయనాడ్‌లో వర్షాలు పడుతున్నా, అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నా సహాయక బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. 

అధికారుల సాహసోపేతమైన ఆపరేషన్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసలు కురిపించారు. ఈ వారం ప్రారంభంలో వాయనాడ్‌లో మూడు కొండచరియలు విరిగిపడటంతో 350 మందికి పైగా మరణించారు మరియు వందల మంది తప్పిపోయారు.

ఈ క్రమంలో తాజాగా అటవీ శాఖ అధికారులు ఎనిమిది గంటలు శ్రమించి ఓ కుటుంబాన్ని ప్రాణాలతో రక్షించారు.  కొండ ప్రాంతంలో చిక్కుకున్న గిరిజన వర్గానికి చెందిన నలుగురు చిన్నారులతో సహా తల్లిదండ్రులను ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేర్చారు.

పనియా కమ్యూనిటీకి చెందిన కుటుంబం లోతైన లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఉన్న గుహలో చిక్కుకుపోయింది. దీంతో కల్పేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కె.హాషిస్ నేతృత్వంలోని బృందం అడవిలో చిక్కుకున్న గిరిజన కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి వెళ్లి రక్షించారు. అయితే వారిని చేరుకోవడానికి రెస్క్యూ టీమ్ నాలుగున్నర గంటలపాటు ప్రమాదకరమైన ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 అయితే వారు కొద్ది రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు నీరసించి పోయి ఉన్నారని రెస్య్కూ అధికారి తెలిపారు. దీంతో నలుగురు పిల్లల తల్లి ఆహారం కోసం అడవిలో వెతుకుతూ ఉండగా తమ కంటపడినట్లు అధికారులు తెలిపారు. తాము రక్షించిన వారిలో తల్లిదండ్రులు, 1 నుంచి 4 ఏళ్ల మధ్యనున్న నలుగురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు.  తమతో రావాల్సిందిగా వారిని కోరగా ముంగు ఆ కుటుంబం నిరాకరించిందని, సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని తెలపగా చివరకు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. 

రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని కాపాడిన అధికారులు సీఎం పినరయి విజయన్‌ ప్రశంసించారు. ‘‘వయనాడ్‌లో నెలకొన్న బీభత్సంలో అటవీ అధికారులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రెస్క్యూ బృందం 8 గంటలపాటు శ్రమించి, ప్రాణాలకు తెగించి ఓ మారుమూల గిరిజన కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను కాపాడింది. ఈ విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తోంది. మనం ఇలా ఐక్యంగా ఉంటూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొందాం.. పునర్నిర్మించుకుందాం’’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement