ఇంఫాల్: మణిపూర్ ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతి చెందింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం పంటపొలాల్లోకి లాక్కెళ్లి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుత‍్తాయి. ఈ ఘటనపై స్పందించిన బాధిత యువతి.. తమను పోలీసులు అల్లరి మూకకు వదిలేసినట్లుగా ఆరోపించింది. పోలీసులు రక్షణ కల్పించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.
అటు.. బాధిత మహిళ భర్త ఆర్మీలో పనిచేసినట్లు తెలుస్తోంది. సైనికుడిగా కార్గిల్ యుద్ధంలో పోరాడిన తమకు ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆయన మనోవేదనకు గురయ్యారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాధితులు విస్తుపోయే విషయాలను వెల్లడించారు. అల్లరి మూక జంతువుల్లా ఆయుధాలతో తమపై ఎగబడ్డారని చెప్పారు. కార్గిల్‌లో పోరాడి దేశాన్ని రక్షించినప్పటికీ దేశంలోపల తన భార్యను కాపాడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి?
పోలీసుల నుంచి లాక్కెళ్లి..
వర్గాల మధ్య పోరులో ఓ గ్రామంపై అల్లరి మూకలు ఎగబడ్డాయి. ఈ క్రమంలో తప్పించుకుంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలపై ఆందోళనకారులు అమానవీయంగా ప్రవర్తించారు. బాధితుల్లో 50 ఏళ్ల వ్యక్తి, అతడి కుమారుడు (19), కుమార్తె (21) కాగా.. మరో ఇద్దరు మహిళలు(52, 42) ఉన్నారు. వీరు సమీప పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులను ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
దాదాపు 800 నుంచి 1000 మందితో ఉన్న ఓ భారీ గుంపు వీరిని పోలీసుల నుంచి లాగి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధిత గ్రూప్‌లోని 19 ఏళ్ల యువకుడు తన సోదరి (21)ని రక్షించేందుకు ప్రయత్నించగా.. సాయుధ మూకల దాడిలో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై స్పందించిన బాధిత యువతి తమను పోలీసులు రోడ్డుపైనే వదిలేశారని వాపోయింది.
ఇదీ చదవండి: మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటిని తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు
సామూహిక అత్యాచారం
ఘటనలో 21 ఏళ్ల యువతితోపాటు మరో మహిళను నగ్నంగా వీధుల్లో ఊరేగించడమే కాకుండా సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. సాయం కోసం వాళ్లు కేకలు పెడుతుంటే..కొందరు యువకులు మాత్రం అమ్మాయిల శరీర భాగాలను చేతులతో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. అయితే అందులో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మే 18నే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జులై 19న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రాగా.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘోర ఘటనకు సంబంధించి ఇప్పటికే తౌబల్ జిల్లాకు చెందిన హెరాదాస్ (32) అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: Manipur Violence.. మహిళపై అఘాయిత్య ఘటన.. అసలు ఆరోజు జరిగింది ఇదేనా!
Comments
Please login to add a commentAdd a comment