భోపాల్: తాను ఏ ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోనని, మధ్యప్రదేశ్ ఓటర్లపై తనకు నమ్మకం ఉందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఆయన స్పందించారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గురువారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధికం బీజేపీకే ఆధిక్యాన్ని ఇచ్చాయి. అత్యధిక సీట్లతో ఆ పార్టీనే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనాలను ప్రకటించాయి. మరోవైపు కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ గణనీయ స్థానాలు సాధిస్తుందని అంచనా వేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌పై కమల్‌నాథ్ మాట్లాడుతూ ‘నేను ఏ పోల్ (ఎగ్జిట్) గురించి పట్టించుకోను. మధ్యప్రదేశ్ ఓటర్లపై నాకు నమ్మకం ఉంది’ అన్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ టచ్‌లో ఉందా అనే ప్రశ్నకు బదులిస్తూ అలా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఇదిలా ఉండగా కనీసం 140 సీట్లతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇండోర్-1 నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శుక్లా విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి కైలాష్ విజయవర్గియాదే పైచేయిగా ఎగ్జిట్ పోల్ ఫలితాలలో వచ్చినప్పటికీ ఆయన దేశానికి బలమైన నాయకుడు అవుతాడేమో కాని తన అసెంబ్లీ నియోజకవర్గానికి కాదని, అక్కడ తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment