న్యూఢిల్లీ: దేశంలో డిసెంబరు 3 నాటికి కరోనా వైరస్ కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నట్లు ‘‘టైమ్ ఫ్యాక్ట్స్- ఇండియా ఔట్‌బ్రేక్ రిపోర్టు’’ అంచనా వేసింది. సెప్టెంబరు తొలివారంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పతాక స్థాయిని చేరతాయని, ఆ తర్వాత క్రమక్రమంగా కరోనా బాధితుల సంఖ్య తగ్గిపోతుందని నివేదికలో వెల్లడించింది. కరోనా విజృంభిస్తున్న తొలినాళ్లలో హాట్‌స్పాట్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై, చెన్నైలలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడాన్ని సానుకూల అంశంగా పేర్కొంది. వాణిజ్య రాజధాని ముంబైలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య శిఖర స్థాయికి చేరుకుందని.. ప్రస్తుతం నమోదవుతున్న కేసులను గతంతో పోల్చి చూసినట్లయితే నవంబరు రెండో వారం నాటికి అక్కడ వైరస్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది.(ఒక్కరోజే 68 వేల కేసులు, 983 మరణాలు)
ఇక చెన్నైలో అక్టోబరు చివరినాటికి, ఢిల్లీలో నవంబరు మొదటి వారం, బెంగళూరులో నవంబరు రెండో వారంలోగా ఇలాంటి సానుకూల ఫలితాలే చూడవచ్చని అంచనా వేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో గత కొన్ని వారాలుగా కరోనా కేసుల సంఖ్య తగ్గముఖం పట్టడం శుభపరిణామమని, విశ్వసనీయ ప్రభుత్వ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను విడుదల చేసినట్లు పేర్కొంది. ఇక ఇండోర్, థానె, సూరత్, జైపూర్, నాశిక్, తిరువనంతపురం వంటి టైర్-2, టైర్-3 సిటీల్లో ఆగష్టులో కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అయితే నవంబరు నాటికి ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా కరోనా తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. (కరోనా కట్టడిలో ఢిల్లీ సక్సెస్ అయిందా? ఎలా?)
అదే విధంగా కరోనా వ్యాప్తిలో కీలకమైన రీప్రొడకక్షన్ రేటు(ఆర్‌ఓ- కరోనా సోకిన వ్యక్తి నుంచి సగటున ఎంతమందికి ఇతర వ్యక్తులకు వైరస్ సంక్రమించిందన్న విషయాన్ని ఇది తెలియజేస్తుంది)లో తగ్గుదల నమోదవుతోందని వెల్లడించింది. ఆగష్టు 15 నాటికి మహారాష్ట్ర, తెలంగాణలో ఇది 1.24గా నమోదు కాగా.. రాజస్తాన్, ఢిల్లీలో ఆర్ వాల్యూ 1.06, 1.10గా ఉందని పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ నాటికి, తెలంగాణలో అక్టోబర్ 17 నాటికి కరోనా పూర్తిగా అంతం కావొచ్చని అంచనా వేసింది. జనాభా, కరోనా నిర్ధారణ పరీక్షలు, కంటైన్మైంట్ జోన్ల తదితర అంశాల ఆధారంగా కరోనా తీవ్రతను అంచనా వేశామని, అయితే తాజా గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ వివరాల్లో కాస్త మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.
ఇక భారత్‌లో గురువారం 68,898 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 29,05,823 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 983 మంది కోవిడ్‌తో మృతి చెందడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 54,849 కు చేరింది. ఇక దేశంలో మహమ్మారి కరోనా నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 21,58,946గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment