
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మృగాళ్లు మారడం లేదు. ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై దారుణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ వీటిపై స్పందించారు. మహిళలు, వెనకబడిన వర్గాల బాలికలపై హింస పెరిగిపోతుంది అన్నారు. అయితే యూఎన్ అధికారులవి అనవసర వ్యాఖ్యలంటూ భారత్ మండిపడింది. ఐక్యరాజ్యసమితి అధికారిని, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని.. "బయటి ఏజెన్సీ అనవసరమైన వ్యాఖ్యలను పట్టించుకోము'' అని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. "మహిళలపై ఇటీవల జరిగిన కొన్ని హింస కేసులకు సంబంధించి యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ కొన్ని అవాంఛనీయ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక విషయం తప్పక తెలుసుకోవాలి. ఏంటంటే ఈ కేసులను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది" అని తెలిపారు. (చదవండి: హథ్రాస్ ఘటన.. రూ.50 లక్షలు ఇస్తామన్నారట!)
అంతేకాక "దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున, బయటి ఏజెన్సీ చేసే ఏవైనా అనవసరమైన వ్యాఖ్యలు ఉత్తమంగా నివారించబడతాయి. రాజ్యాంగం భారతదేశ పౌరులందరికీ సమానత్వానికి హామీ ఇస్తుంది. ప్రజాస్వామ్యంగా, అందరికీ న్యాయం అందించే సమయం-పరీక్షించిన రికార్డు మా వద్ద ఉంది" అని తెలిపారు. భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని హథ్రాస్, బల్రాంపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న అత్యాచార కేసులకు సంబంధించి ఈ రోజు యూఎన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ''హథ్రాస్, బల్రాంపూర్లో జరిగిన అత్యాచారం, హత్య కేసులను పరిశీలిస్తే.. భారత్‌లో మహిళలు, వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన బాలికలు లింగ ఆధారిత హింసకు ఎక్కువగా గురవుతున్నారని తెలుస్తుంది" అని యూఎన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment