సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని జైళ్లలో ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువమంది కిక్కిరిసి ఉంటున్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 1,330 జైళ్లలో 4,36,266 మంది ఖైదీలను ఉంచేందుకు వీలుండగా.. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఏకంగా 5,73,220 మంది ఖైదీలు ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని జైళ్లలో సామర్థ్యం కంటే తక్కువగా ఖైదీలు ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని జైళ్లలో సామర్థ్యం కంటే స్వల్పంగా ఎక్కువ సంఖ్యలో ఖైదీలు ఉన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా లిఖితపూర్వకంగా ఇచ్చి న సమాధానంలో ఈ వివరాలనువెల్లడించారు.
యూపీలో అత్యధికంగా..
♦ దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్(యూపీ)లోని 77 జైళ్లలో 67,600 మంది ఖైదీల సామర్థ్యం ఉండగా.. ఏకంగా 1,21,609 మంది ఖైదీలు మగ్గుతున్నారు. బీహార్‌లోని 59 జైళ్లలో 47,750 మంది సామర్థ్యానికిగాను 64,914 మంది ఖైదీలు ఉన్నారు.
♦ మధ్యప్రదేశ్‌లోని 132 జైళ్లలో 48,857 మంది ఖైదీలు.. మహారాష్ట్రలోని 64 జైళ్లలో 41,070 మంది ఖైదీలు.. పంజాబ్‌లోని 26 జైళ్లలో 30,801 మంది ఖైదీలు.. జార్ఖండ్‌లోని 32 జైళ్లలో 19,615 ఖైదీలు.. ఢిల్లీలోని 16 జైళ్లలో 18,497 మంది ఖైదీలు ఉన్నారు.
♦ తెలంగాణలోని 37 జైళ్లలో 7,997 మంది సామర్థ్యానికిగాను 6,497 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో 2,102 మంది దోషులు, 4,221 మంది విచారణ ఖైదీలు, 174 మంది నిర్బంధిత ఖైదీలు ఉన్నారు.
♦ ఆంధ్రప్రదేశ్‌లోని 106 జైళ్లలో 8,659 ఖైదీల సామర్థ్యానికిగాను 7,254 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో 1,988 మంది దోషులు, 5,123 మంది విచారణ ఖైదీలు, 134 మంది నిర్బంధిత ఖైదీలు, 9 మంది ఇతరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment