సోషల్‌గా జర జాగ్రత్త! ఉద్యోగాలకే ఎసరు | Job cuts on social media comments and controversial posts | Sakshi
Sakshi News home page

సోషల్‌గా జర జాగ్రత్త.. ఉద్యోగాలు రావు.. ఉన్నవి ఊడుతాయ్‌ కూడా!

Published Tue, Jun 28 2022 5:36 AM | Last Updated on Tue, Jun 28 2022 7:58 AM

Job cuts on social media comments and controversial posts - Sakshi

మీరు ఉద్యోగులా? లేక కొలుకు కోసం వెదుకులాటలో ఉన్నారా? అయితే సోషల్‌ మీడియా వాడకంలో కాస్త జాగ్రత్త. అవి ఉన్నదే అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు కదా అంటారా? అలాంటి మాటలు వాదనకే బాగుంటాయి. సోషల్‌ మీడియాలో పెడుతున్న కామెంట్లు చాలామంది కొలువులకు ఎసరు పెడుతున్నాయి. పనిష్మెంట్‌ బదిలీలకు, ప్రమోషన్ల నిలిపివేతకు కారణమవుతున్నాయి. వివాదాస్పద కామెంట్లు పెట్టేవారికి ఉద్యోగాలిచ్చేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు కూడా...

ప్రభుత్వ విధానాలను సోషల్‌ మీడియాలో విమర్శించినందుకు గత అక్టోబర్లో ఢిల్లీలో ఓ కానిస్టేబుల్‌ ఉద్యోగం కోల్పోయాడు. కేంద్ర మంత్రిపై విమర్శలు చేసినందుకు కర్ణాటకలో తాజాగా ఓ టీచర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. సోషల్‌ మీడియాలో పెట్టే కామెంట్ల ప్రకంపనలు చాలా దూరం ప్రయాణిస్తున్నాయి. ఉద్యోగులు, ఉద్యోగార్థుల ‘సోషల్‌’ లైఫ్‌ మీద యాజమాన్యాలు, కంపెనీల నిఘా కొన్నేళ్లుగా బాగా పెరిగింది. అభ్యంతరకర, వివాదాస్పద కామెంట్లు చేస్తే ఉపాధికే ఎసరొస్తోంది.

మరీ ముఖ్యంగా జాతి వివక్ష, జాతీయ భద్రత, ఉగ్రవాదం, తీవ్రవాదం వంటివాటిపై సోషల్‌ మీడియాలో అస్సలు మాట్లాడకూడదని ఓ అంతర్జాతీయ అధ్యయనంలో తేలింది. ఈ మధ్య కాలంలో 28 శాతం మంది ఇలాంటి వాటిపై వ్యాఖ్యల వల్లే వీధిన పడ్డారట. వ్యక్తుల ఇష్టాయిష్టాలపై అనుచిత వ్యాఖ్యలు, మహిళలను ద్వేషించడం వల్ల 12 శాతం మంది ఉద్యోగాలకు ఎసరొచ్చిందట.

ఆఫీసుల్లో గొడవలు పడి 17 శాతం, సోషల్‌ మీడియాలో కుళ్లుజోకులు, కనీస మానవత్వం లేని ప్రవర్తనతో 16 శాతం, బూతులు, హింసకు దిగుతామనే బెదిరింపులతో 8 శాతం, రాజకీయ విమర్శలతో 5 శాతం మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు!! సోషల్‌ మీడియా పోస్టులు, వ్యాఖ్యలతో ఉద్యోగాలు కోల్పోయిన ఉదంతాలపై వచ్చిన వందలాది వార్తా కథనాల ఆధారంగా జరిగిన అధ్యయనంలో తేలిన విషయాలివి. మన దేశంలోనూ రాజకీయ విమర్శలు చేసినందుకు సామాజిక కార్యకర్తలు జైలుపాలవడం, కొందరిపై భౌతికదాడులు జరగడం తెలిసిందే.

ఉద్యోగార్థులపై సోషల్‌ నిఘా
గత పదేళ్లలో ఆధారంగా ఉద్యోగుల ఎంపికలో సోషల్‌ మీడియా పోస్టులు, వ్యాఖ్యలను లోతుగా గమనించే ధోరణి పెరిగిందని వాషింగ్టన్‌ పోస్టు వెల్లడించింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్‌ వంటి దిగ్గజాలు జాతి వివక్ష, వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేస్తే ఎంత టాలెంటున్నా ఉద్యోగాలివ్వడం లేదు. ‘సోషల్‌’ హిస్టరీ బాగా లేకపోవడం వల్ల కంపెనీకి ఎంతో ఉపయోగపడతారనుకున్న ప్రతిభావంతులను కూడా వదులుకోవాల్సి వస్తోంది. ఇది బాధాకరమే అయినా తప్పడం లేదు. పని చేసే చోట ఇబ్బందులు రాకూడదు కదా! అందుకే నాయకత్వ స్థానాల్లో ఉండేవారికి ఎలాంటి బలహీనతలూ ఉండొద్దన్న నియమాన్ని కచ్చితంగా పాటిస్తున్నాం’’ అని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల వర్ణవివక్షపై జరిగిన ఓ సదస్సులో బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

‘సేజ్‌ పబ్‌’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కంపెనీల మానవ వనరుల విభాగాలు ఏయే అంశాలను గమనిస్తున్నాయంటే...
► ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు?
► ఏ అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్నారు?
► సొంతగా ఏమైనా బ్లాగులు రన్‌ చేస్తున్నారా?
► వీటితో పాటు పలు ఇతర అంశాలపైనా నిఘా పెడుతున్నారు.
► పోలీసు (20%), టీచర్లు (24%), ప్రభుత్వోద్యోగులు (14%), ఆతిథ్య, రిటైల్‌ రంగాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉందట.
► వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టులతో ఉద్యోగాలు పోతాయని మన దేశంలో 40 శాతం మందికి భయమున్నట్టు గతేడాది ఓ అధ్యయనంలో తేలింది.నే పలు సోషల్‌ మీడియా పోస్టులను డిలీట్‌ చేసినట్లు చాలామంది అంగీకరించారు.
► పని చేస్తున్న కంపెనీ, సంస్థపై సోషల్‌ మీడియాలో చెడుగా రాశామని 25.7 శాతం మంది ఒప్పుకున్నారు.
► సోషల్‌ మీడియా పోస్టుల వల్ల తమకేమీ కాదని 46.9 శాతం మంది నమ్ముతున్నారు.  


భిన్నాభిప్రాయాలు
సోషల్‌ మీడియా పోస్టులకు కెరీర్‌తో ముడి పెట్టడం సబబా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. బికినీతో ఫొటో దిగి ఇన్‌స్టాలో పెట్టినందుకు ఒకరి ఉద్యోగం పోయింది. ఇది వ్యక్తిగత జీవితంలోకి అనుచితంగా చొరబడటమేనన్న వాదన ఉంది. సున్నిత అంశాలపై వివాదాస్పదంగా పోస్టులు పెట్టకపోవడమే మేలన్నది 2021 గ్రహీత సాహిత్య నోబెల్‌ గ్రహీత అబ్దుల్‌ రజాక్‌ గుర్మా వంటివారి అభిప్రాయం. ఇది యువతలో అభద్రతా భావం పెంచుతున్న వాదనతో గూగుల్‌ హెచ్‌ఆర్‌ విభాగం హెడ్‌ ప్రీతి నారాయణ్‌ అంగీకరించారు. కానీ విశృంఖలతకు ఎక్కడో ఒకచోట ఫుల్‌ స్టాప్‌ పడాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

:::కంచర్ల యాదగిరిరెడ్డి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement