జయప్రకాష్ నారాయణ్.. భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, దానికిమించి ప్రజా నేత. భారత మాజీ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించడం ద్వారా అమితమైన ప్రజారదణ పొందారు. ఆయన జీవితాంతం ప్రజాసేవ చేస్తూనే ఉన్నారు. ఉన్నత పదవులు వరించినా, వాటికి దూరంగా ఉంటూ ప్రజల కోసం పలు పోరాటాలు సాగించారు.
ఒకానొక సమయంలో జయప్రకాష్ నారాయణ్‌కు భారత ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించారు. మరోమారు రాష్ట్రపతి అయ్యే ప్రతిపాదన వచ్చినా దానిని కూడా తిరస్కరించారు. 1901 అక్టోబర్ 11న బెంగాల్ ప్రెసిడెన్సీ (నేటి బీహార్ రాష్ట్రం)లోని సరన్ జిల్లాలోని సీతబడియార గ్రామంలో జన్మించిన జయప్రకాష్ నారాయణ్ 9 ఏళ్ల వయస్సులో చదువు కోసం పట్నాకు వచ్చారు. గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరిన కారణంగా కాలేజీని విడిచిపెట్టారు. తరువాత తన చదువును కొనసాగించారు.
ఉద్యమం కోసం కాలేజీ చదువును మధ్యలోనే వదిలిన ఆయన బీహార్ విద్యాపీఠ్‌లో అడ్మిషన్ తీసుకుని, చదువు పూర్తి చేశారు. తన 20 ఏళ్ల వయసులో కార్గో షిప్‌లో అమెరికా చేరుకున్నారు. కాలిఫోర్నియాలో రెండు సంవత్సరాలు డిష్ వాషర్‌గా, గ్యారేజీలో మెకానిక్‌గా, ఔషధాల విక్రయం, పండ్లను ప్యాకింగ్ చేయడం, బోధించడం వంటి పనులు చేస్తూ, ఉన్నత విద్యను పూర్తి చేశారు.
అమెరికాలో చదువుకుంటూనే ఆయన కార్మికుల సమస్యలను తెలుసుకునేవారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి సోషల్ సైన్సెస్‌లో ఎంఏ, ఒహియో విశ్వవిద్యాలయం నుండి అప్లైడ్ సైన్సెస్‌లో డిగ్రీ చేశారు. ఈ సమయంలో ఆయన కార్ల్ మార్క్స్ , అతని సోషలిజం సిద్ధాంతాలకు ప్రభావితులయ్యారు. 1929లో భారతదేశానికి తిరిగి వచ్చాక గాంధీ చెంత చేరారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లారు. అనంతరం కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని స్థాపించారు. అయితే అప్పటికే ఆయన దేశ రాజకీయాలపై తీవ్ర నిరాశకు లోనయ్యారు. 1954లో బీహార్‌లోని గయలో వినోబా భావే చేపట్టిన సర్వోదయ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రకటించారు.
1960వ దశకం చివరిలో రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. 1974లో బీహార్ రైతుల కోసం ఉద్యమించారు. ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ రాజకీయ కార్యాచరణను కొనసాగించారు. 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన పిలుపు మేరకు వేలాది మంది విద్యార్థులు ఉద్యమంలోకి దూకారు. ఎమర్జెన్సీ సమయంలో జేపీ జైలుకెళ్లారు. అనంతరం విడుదలయ్యారు.
1977లో జరిగిన ఎన్నికల్లో జేపీ నేతృత్వంలోని ప్రతిపక్షం ఇందిరా గాంధీపై భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో జేపీ ప్రధానమంత్రి పదవికి తిరుగులేని బలమైన పోటీదారుగా మారారు. అయినా ప్రధాని పదవిని చేపట్టలేదు. అధికారానికి దూరంగా ఉండాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. తరువాత అతని పార్టీ, ప్రభుత్వం రాష్ట్రపతి పదవిని అంగీకరించాలని ఆయనను కోరింది. అయితే దీనిని కూడా జేపీ తిరస్కరించారు. రాజకీయాల్లో ఉన్నత ఆదర్శాలకు కట్టుబడిన నేతగా పేరొందారు. పలు అనారోగ్య కారణాలతో జేపీ 1979, అక్టోబర్ 7న బీహార్‌లోని పట్నాలో కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: పాక్‌లో బరేల్వీ వర్గంపై దాడులు ఎందుకు పెరిగాయి?
Comments
Please login to add a commentAdd a comment