
బెంగుళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టే ఒక వీడియో బహిర్గతమైంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి.కె. శివకుమార్ అవినీతిని ఆ పార్టీకే చెందిన ఇద్దరు ముఖ్య నేతలు చర్చించుకుంటున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.ఎస్. ఉగ్రప్ప, మీడియా సమన్వయకర్త ఎంఏ సలీమ్ ఆ వీడియోలో డీకే శివకుమార్ అవినీతిపై చర్చించుకుంటున్నారు. శివకుమార్ రాష్ట్ర మంత్రిగా ఉన్న కాలంలో సాగునీటి ప్రాజెక్టులలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం అప్రమత్తమైంది.
ఎంఏ సలీంను పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది. ఉగ్రప్పకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. మూడ్రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వీడియో క్లిప్పులో నాయకులు ప్రస్తావించిన అంశాలపై శివకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి మాటల్లో వాస్తవాలు లేవన్నారు. 2018లో కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న శివకుమార్ ఉన్నారు. ఆ కాలంలో డీకే అవినీతిపై ఆ ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. ‘ప్రాజెక్టుల్లో మొదట్లో 8 శాతం వాటా ఉండేది. దాన్ని డీకే వచ్చి 12 శాతానికి పెంచారు. ఆయన సహచరుడే రూ.50–100 కోట్లు సంపాదించాడు. అలాంటప్పుడు డీకేకి ఎంత భారీ స్థాయిలో లంచాలు వచ్చి ఉంటాయో ఊహించుకోవచ్చు’ అని సలీం..ఉగ్రప్పకు చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.