
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. విద్వేషంపై ప్రేమ విజయం సాధించిందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఫలితమే పునరావృతం కావడం ఖాయమన్నారు. ‘‘కర్ణాటకలో విద్వేష బజార్ మూతపడింది. ప్రేమ బజార్ తెరుచుకుంది.
కాంగ్రెస్‌కు అద్భుత విజయం కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు. పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు. మేం ద్వేషం, చెడు భాష వాడకుండా ప్రజలపై ప్రేమాభిమానాలే అండగా పోటీ చేసిన తీరుకు చాలా ఆనందంగా ఉంది. ఆశ్రిత పెట్టుబడిదారుల బలంపై పేదల బలమే గెలిచింది. రాష్ట్ర ప్రజలకిచ్చిన ఐదు హామీలను తొలి మంత్రివర్గ భేటీలోనే నెరువేరుస్తాం’’ అని ప్రకటించారు.