10% ఈవీఎంలను మారిస్తే ఫలితాలు తారుమారు
ఏపీలో ఐదేళ్లకోసారి ప్రభుత్వ మార్పు..
‘రియల్’ పెట్టుబడులకు అమరావతి కంటే హైదరాబాద్, బెంగళూరు బెటర్
ఢిల్లీలో మీడియాతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వాటి ట్యాంపరింగ్ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.
‘2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాంపరింగ్ జరుగుతోందని ప్రశ్నించిందే టీడీపీ (అప్పుడు నేను ఆ పార్టీలోనే ఉన్నా). ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో దీనిపై సెమినార్ నిర్వహించి అవగాహన కల్పించాం. అప్పట్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించి అరెస్టులు కూడా జరిగాయి’ అని చెప్పారు. ‘ఎన్నికలకు ముందురోజు ప్రతి నియోజకవర్గానికి ఈవీఎంలను తీసుకొచ్చి పంపిణీ కేంద్రంలో ఉంచుతారు.
పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంల కంటే 15 శాతం ఈవీఎలను ఎక్కువగా కేటాయిస్తారు. ఎన్నికల రోజు ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే వీటిని వాడుకుంటారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలన్నీ తొలుత డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కే వస్తాయి. అక్కడే రాత్రంతా ఉంచుతారు. ఆ రాత్రి ఈవీఎంలను అటూ ఇటూ మార్చేలా ఏదైనా జరగొచ్చు. పోలింగ్ ముగిసిన మర్నాడు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు వెళ్తున్నాయి’ అని రేవంత్ పేర్కొన్నారు.
ఫ్రీక్వెన్సీని బట్టి ట్యాంపరింగ్
‘ఈవీఎంల ట్యాంపరింగ్‌ను ఎక్కడో కూర్చుని చేశారా.. లేక చిప్‌లలోకి ఏదైనా ఫ్రీక్వెన్సీని పంపారా అనేది మనం చెప్పలేము. చిప్‌లోకి లోఫ్రీక్వెన్సీ అయితే ఒకలాగా, హైఫ్రీక్వెన్సీ అయితే మరోలాగా ఈవీఎంలను ఆపరేట్ చేయొచ్చు. కంపెనీ తయారు చేసే ప్రొగ్రామ్‌ని బట్టే ఈవీఎం పని చేస్తుంది. ప్రోగ్రాం రీరైడ్ చేయాలంటే మిషన్ చేతికి రావాల్సి ఉంటుంది. అయితే సిగ్నల్ ద్వారా ట్యాంపరింగ్ చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియదు.
ఫ్రీక్వెన్సీ ఉంటే ఒకలా, లేకపోతే ఇంకోలా దేనికి దానికే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుంది. గెలుపోటముల కోసం 100 శాతం మెషీన్లను ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్‌గా 10 శాతం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండొచ్చు. అంటే 10 వేల ఓట్ల వ్యవధిలోనే గెలుపోటములను డిసైడ్ చేయొచ్చు కదా’ అని రేవంత్ చెప్పారు.
ఏపీలో ఐదేళ్లకు ప్రభుత్వం మార్పు
ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో పదేళ్లకు ఒకమారు, ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే ట్రెండ్ కొనసాగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఐదేళ్లకు ప్రభుత్వం మారుతుందన్నారు. ఏపీ రాజధాని అమరావతి హైదరాబాద్‌కు ఎంతమాత్రం పోటీ కాదన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కంటే హైదరాబాద్ శివారు ప్రాంతాలు, వరంగల్ లేదా బెంగళూరు, చెన్నైలలోనూ పెట్టుబడి పెట్టడం మంచిదని సలహా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment