![Kuno National Park: One Of 8 cheetahs Brought From Namibia Dies - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/27/kuno.jpg.webp?itok=htY1OUYe)
నమీబియా నుంచి తీసుకువచ్చి గతేడాది మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఉంచిన 8 చీతాల్లో ఒక చీతా మృతి చెందింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ సాషా అనే చీతా సోమవారం మరణించినట్లు అధికారులు తెలిపారు. సాషా భారత్‌కు తీసుకురాకముందే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. జనవరి 23న ఈ చీతాలో అలసట, బలహీనత వంటి అనారోగ్య లక్షణాలు కనిపించాయని, దీంతో చికిత్స కోసం క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌కు తరలించామని తెలిపారు. కాగా సాషా వయసు మూడేళ్లు. ఇది క్యాప్టివ్ బ్రీడ్ జాతికి చెందినది
భారత్‌లో అంతరించిపోతున్న చీతాలను తిరిగి పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ తన జన్మదినం సందర్భంగా (సెప్టెంబర్ 17) 8 ఆఫ్రీకన్ చీతాలను కునో నేషనల్ పార్కు క్వారంటైన్ జోన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో మూడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. నమీబియా నుంచి భారత్‌లో అడుగుపెట్టిన చీతాలను కొన్ని నెలల పాటు గడ్డి మైదానంతో ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో క్వారంటైన్ చేశారు.
భారతీయ వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడిన తర్వాత నవంబర్‌లో పెద్ద ఎన్‌క్లోజర్లలో ఉంచి పర్యవేక్షించారు తరువాత స్వేచ్ఛగా జాతీయ పార్కులో విడిచిపెట్టారు. అంతేగాక త్వరలోనే భారత్‌కు మరో 12 చీతాలు కూడా రానున్నాయి. రెండో విడతలో భాగంగా వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment