
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వర్ (71) కుటుంబంలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. మంత్రి భార్యకు, ఆయన కుటుంబ సభ్యుల్లో మరో ఆరుగురికి అక్టోబర్ 31, శనివారం కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన పార్లమెంటు సభ్యుడు గంగ్వార్ విలేకరులతో మాట్లాడుతూ తనకు నెగెటివ్ రిపోర్టు వచ్చినప్పటికీ తన ఫ్యామిలీలో మరో ఏడుగురికి కరోనా సోకినట్టు వెల్లడించారు.
తన కుటుంబ సభ్యులు ఇటీవల ఢిల్లీ వెళ్లారని, బహుశా అక్కడే వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నానన్నారు. వీరంతా ఫరీదాబాద్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కేంద్రమంత్రి వెల్లడించారు. తమ ఫ్యామిలీ వంటమనిషి కూడా అస్వస్థతకు గురి కావడంతోముందు జాగ్రత్తగా మరో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే తన మంత్రిత్వ శాఖలో కొందరు అధికారులకు కరోనా వైరస్ సోకిందని, వారినందరినీ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారని ఆయన చెప్పారు. కాగా ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 81,37,119కు చేరగా మొత్తం మరణాల సంఖ్య 1,21,641 గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment