సాక్షి, ఢిల్లీ: లక్షద్వీప్ ఎన్‌సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం విషయంలో.. లోక్‌సభ సెక్రటేరియెట్ వెనక్కి తగ్గింది. సుప్రీం కోర్టులో ఇవాళ వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫైజల్‌పై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు, లక్షద్వీప్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది లోక్‌సభ. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియెట్ జనరల్ పేరిట ఓ నోటిఫికేషన్‌ను ఉదయమే రిలీజ్ చేసింది.
2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. మాజీ కేంద్ర మంత్రి పీఎం సయ్యిద్ అల్లుడు మహ్మద్ సాలిహ్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు మహ్మద్ ఫైజల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు 2016, జనవరి 5వ తేదీన ఫైజల్‌పై అండ్రోథ్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు.
అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది కవరత్తి కోర్టు. దీంతో జనవరి 13వ తేదీన లోక్‌సభ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. అది తప్పుడు కేసు అని, ఫైజల్‌ను నిర్దోషిగా తేలుస్తూ, లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అంశం పరిశీలించమని లోక్‌సభ సెక్రటేరియట్‌కు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, లోక్‌సభ సెక్రటేరియేట్ మాత్రం జాప్యం చేస్తూ వస్తోంది.
దీంతో కింది కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే విధించినా, లోక్‌సభ సెక్రటేరియట్ మాత్రం తనను అనర్హునిగా ప్రకటిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవడం లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారాయన. ఈ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం మంగళవారం వాదనలు వింది. బుధవారం కూడా వాదనలు వినాల్సి ఉంది. ఈ లోపే లోక్‌సభ సచివాలయం ఆయన అనర్హత వేటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడడంతో.. ఫైజల్ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి, ఇవి రాహుల్ కేసులోనూ వర్తించే అవకాశాలున్నాయన్న చర్చ ద్వారా ఆసక్తి రేకెత్తింది.
Comments
Please login to add a commentAdd a comment