మన దేశ చట్టాల్లో భూతద్దం పెట్టి చూసిన దొరకని ‘సహజీవనం’ అనే బంధం గురించి ఆసక్తికరమైన తీర్పు ఒకటి వెలువడింది. సహజీవనంలో ఉన్న ఓ జంట విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. అయితే చట్టం ప్రకారం అది పెళ్లి కానప్పుడు.. విడాకుల ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని ఓ జంటను ప్రశ్నించింది కేరళ హైకోర్టు.
ఏ చట్టంలోనూ కలిసి ఉంటే పెళ్లి అని లేదు. ఇద్దరి మనసులు కలిసాయని సహజీవనం చేసేవాళ్లకు విడాకులు అడిగే హక్కే లేదు. కేవలం పర్సనల్, సెక్యులర్ చట్టం ప్రకారం వివాహం జరిగినప్పుడే దానికి గుర్తింపు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం కలిసి జీవించినా.. అది వివాహం కిందకు రాదని, విడాకులకు ఆస్కారం ఉండదని స్పష్టం చేసింది బెంచ్. చట్టం ప్రకారం ఒక్కటైన జంటలకు మాత్రమే విడాకులు తీసుకునే హక్కు మన చట్టాలు కల్పించాయని ఈ సందర్భంగా పిటిషనర్లకు కోర్టు గుర్తుచేసింది.
2006 నుంచి వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. పైగా తమ బంధానికి సంబంధించి ఒప్పంద పత్రం కూడా రాసుకున్నారు. ఓ బిడ్డనూ కన్నారు. ఈ క్రమంలో మనస్పర్థలతో విడిపోవాలని నిర్ణయించుకున్న ఆ జంట స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే.. చట్ట ప్రకారం వివాహం కానప్పుడు విడాకులు ఎలా ఇస్తామని ప్రశ్నిస్తూ పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు కొట్టేసింది.
దీంతో ఫ్యామిలీ కోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఆ జంట. చట్టం ప్రకారం సహజీవనానికి గుర్తింపు లేదు. కలిసి ఉండడానికి మీకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఇప్పుడు విడిపోవడానికి చట్టం ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇది వీలుకాని విషయం. చట్టంలోనూ అందుకు వెసులుబాటు లేదు అని జస్టిస్ ముహమ్మద్ ముస్తాఖ్, జస్టిస్ సోఫీ థామస్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు ఇచ్చింది.
ఇక ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు తీరుపైనా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టం ద్వారా గుర్తించబడిన వివాహాలకు సంబంధించిన దావాలను మాత్రమే స్వీకరించే పరిధి ఫ్యామిలీ కోర్టులకు ఉందని, పై పిటిషన్‌ను విచారణకు తీసుకుని కొట్టేసే బదులు.. పిటిషన్ నిర్వహణ సాధ్యం కాదని ముందుగానే పిటిషన్‌ను తిరస్కరించి ఉండాల్సిందని, తద్వారా కోర్టు సమయం వృథా కాకుండా ఉండేదని హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment