కొడుకు కోసమైన బెయిల్ ఇవ్వాలంటూ కవిత పిటిషన్
అమ్మగా తన విధిని నిర్వర్తించుకునేందుకు మినహాయింపు కావాలని విజ్ఞప్తి
కవితకు బెయిల్ వద్దని కోర్టుకు తెలిపిన ఈడీ లాయర్
ఈ నెల 8న కవిత బెయిల్‌పై తీర్పు ఇవ్వనున్న కోర్టు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరపున జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 8వ తేదీ ఉదయం 10.30 గంటలకు న్యాయమూర్తి కావేరి భవేజ బెయిల్‌పై తీర్పు వెల్లడించనున్నారు. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై వాదనలను ఏప్రిల్ 20కు వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు.
లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం విచారణ చేపట్టింది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన రెండో పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది.
కవిత తరపున లాయర్ అభిషేక్ సింఘ్వీ మను వాదనలు
- కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయి
- కవిత కొడుకు పరీక్షల భయం ఉంది
- అమ్మగా కొడుకు చదువును పర్యవేక్షించడం, ధైర్యం చెప్పడం కవిత హక్కు
- పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలి
- ప్రధాని మోదీ చాలా సందర్భాల్లో పిల్లల పరీక్షల సన్నద్ధతను ప్రస్తావించారు.
- తల్లి అరెస్ట్ తనయుడిపై ప్రభావం ఉంటుంది
- ఒక మహిళగా కవితకు ఉన్న బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలి
కవితకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని ఆధారాలను ఈడీ తరపు లాయర్ జోయబ్ హుస్సేన్ న్యాయమూర్తికి చూపించారు. అనంతరం వాదనలు వినిపించారు
- కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి, సాక్షాలను ధ్వంసం చేస్తారు
- కవిత లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నారు
- ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు
- ఇప్పటికే కవిత తనయుడికి 11 పరీక్షలకు గాను 7 పరీక్షలు పూర్తి అయ్యాయి
- కొడుకు పరీక్షల ఒత్తిడికి గురవుతున్నాడన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవు, వైద్య నివేదికలు లేవు
- ఇండో స్పిరిట్‌లో అరుణ్‌పిళ్లై, కవితకు 33 శాతం వాటా ఉంది
- కవిత తన ఫోన్లలో డేటాను డిలీట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఫార్మాట్ చేశారు
- ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాతే ఫోన్లలో డేటా ఫార్మాట్ జరిగింది
- డిజిటల్ ఆధారాలు లేకుండా ఉండేందుకే కవిత ఈ పని చేశారు
- ఇప్పటికే స్టేట్‌మెంట్ ఇచ్చిన వాళ్లను వెనక్కి తీసుకునేలా కవిత తరపు వారు ఒత్తిడి తెస్తున్నారు
- కవితకు నోటీసు ఇవ్వగానే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు
- దినేష్ అరోరా అప్రూవర్‌గా మారాక అన్ని విషయాలు చెప్పాడు
- బుచ్చిబాబు ఫోన్‌లోని చాట్స్‌తో ఎక్సైజ్ పాలసీ నోట్స్ రికవరీ అయ్యాయి
- ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది
- ఈ కేసులో మరికొంతమందిని ప్రశ్నిస్తున్నాం
- ఈ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు తెలిపింది.
కాగా లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు ఆమె.
Comments
Please login to add a commentAdd a comment