న్యూఢిల్లీ: సరిహద్దులో భారత్, చైనా జవాన్ల ఘర్షణ, చైనా దురాక్రమణ గురించి పార్లమెంట్‌లో చర్చించాలన్న డిమాండ్‌పై ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. లోక్‌సభలో గురువారం సైతం ఇదే అంశాన్ని విపక్ష సభ్యులు లేవనెత్తారు. సభలో ఇతర వ్యవహారాలను పక్కనపెట్టి, చైనా ఆగడాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి, సమాధానం చెప్పాలని, నిరంకుత్వం చెల్లదని నినాదాలు చేశారు.
చర్చకు సభాపతి నిరాకరించడంతో సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో ఐదుసార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో లోక్‌సభను ఒకేరోజు ఐదుసార్లు వాయిదా ఇదే మొదటిసారి. విపక్షాల నినాదాల హోరు కొనసాగుతుండగానే మరోవైపు కేంద్ర వాణిజ్యమంత్రి గోయల్ ‘జన విశ్వాస్ (సవరణ) బిల్లు–2022’ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
బిల్లును పార్లమెంట్ జాయింట్ కమిటీ పరిశీలనకు పంపాలని సిఫార్సు చేశారు. విపక్షాల ఆందోళన కారణంగా సభా వ్యవహారాలేవీ సాగలేదు. ప్రశ్నోత్తరాల్లో పాల్గొనాలని స్పీకర్ బిర్లా పదేపదే కోరినా కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు వినిపించుకోలేదు. సరిహద్దులో ఘర్షణపై చర్చ ప్రారంభించాలని పట్టుబట్టారు. కరోనా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటన చేస్తున్న సమయంలోనూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. చైనా దురాక్రమణపై చర్చించాలని కోరుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో పలువురు విపక్ష సభ్యులు ఇప్పటికే వాయిదా తీర్మానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఒకరోజు బహిష్కరించిన విపక్షాలు
సరిహద్దు అంశంపై చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ విపక్షాలన్నీ గురువారం రాజ్యసభ కార్యకలాపాలను బహిష్కరించాయి. తొలుత ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ప్రారంభించారు. సభను అడ్డుకోవద్దంటూ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. అయినా నినాదాలు ఆపలేదు. సరిహద్దు వ్యవహారంపై చర్చకు చైర్మన్ అంగీకరించకపోవడంతో సభను బహిష్కరిస్తున్నట్లు విపక్ష ఎంపీలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment