ప్రమాణ స్వీకారం చేయనున్న నూతన ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24 నుంచి జూలై 3వ తేదీ వరకూ జరుగనున్నాయి. కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరడంతో లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహించడానికి స్పీకర్‌ను ఎంపిక చేయడంతోపాటు నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎనిమిది రోజులపాటు నిర్వహించే ప్రత్యేక సమావేశాల్లో తొలి రెండు రోజులు సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ సభ్యుడు కొడికొన్నిల్ సురేశ్ వ్యవహరించనున్నట్లు సమాచారం.
లోక్‌సభలో ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యుడు వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి లోక్‌సభకు ఎన్నికైన వారిలో కొడికున్నిల్ సురేశ్, గత సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన వీరేంద్రకుమార్ ఖతిక్(బీజేపీ) ఎనిమిదేసి పర్యాయాలు ఎంపీలుగా నెగ్గారు. వీరేంద్రకుమార్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కారణంగా కొడికున్నిల్ సురేశ్‌కు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది.
సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎంపిక జరుగనుంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జేడీ(యూల) లోక్‌సభ సభాపతి పదవి కోసం పట్టుపడుతున్నప్పటికీ ఆ స్థానానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ అందుకు అంగీకరించడం లేదు. స్పీకర్ పోస్టును వదులుకోబోమని చెబుతోంది. గత సమావేశాలకు సభాపతిగా పనిచేసిన ఓం బిర్లాతోపాటు పలువురి పేర్లను బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. మరోవైపు, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేరు పరిశీలనలో ఉందన్న వార్తలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment