ఓటమనేదే లేకుండా ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు
కొందరికి హ్యాట్రిక్ గెలుపు, మరికొందరు ఐదు, ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నిక
వీరిలో ఏక్‌నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి దిగ్గజనేతలు
ఏకంగా తొమ్మిదిసార్లు గెలిచి రికార్డు సృష్టించిన బీజేపీఎమ్మెల్యే కాలీదాస్ కోళంబ్కర్
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై పరిధిలో కొందరు అభ్యర్ధులు మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగి విజయ దుందుభి మోగించారు. కొందరు హ్యాట్రిక్ సాధించి అందరిని ఆశ్చర్య పరిచారు. మరికొందరు ఓటమనేదే లేకుండా వరుసగా విజయం సాధిస్తూ రికార్డులు సృష్టించారు. వీరిలో కొందరు ఐదు, ఆరు సార్లు విజయం సాధించగా ఒకరైతే ఏకంగా తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సష్టించారు. ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజల ఆదరణతో అనేక పర్యాయాలు గెలుస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలెవరు, ప్రజల్లో వారికున్న క్రేజ్, ఆదరణ ఎలాంటిదో ఓసారి పరిశీలిద్దాం.
వడాలాలో కాలీదాస్ విజయఢంకా...
బీజేపీ నేత కాలీదాస్ కోళంబ్కర్ వడాల అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వరుసగా తొమ్మిదిసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. 72 ఏళ్ల కాలీదాస్ తనకు ఇవే చివరి ఎన్నికలని, ఈసారి గెలిస్తే తన పేరు గిన్నిస్‌బుక్‌లో నమోదవుతుందని విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆ నియోజక వర్గ ప్రజలు భారీగా ఓట్లువేసి ఆయన్ను గెలిపించారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)కు చెందిన స్నేహల్ జాధవ్, శివసేన(యూబీటీ) అభ్యర్థి శ్రద్ధా జాధవ్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ కాలీదాస్ 24 వేల ఓట్ల అధిక్యంతో గెలిచారు. ఈ సారి కాలీదాస్‌ను ఎలాగైనా ఓడించాలని ఇరువురు అభ్యర్ధులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. కాలీదాస్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీచేసి గెలిచారు. 2009, 2014లో కాంగ్రెస్ టిక్కెటుపై ఇదే వడాలా నియోజక వర్గం నుంచి పోటీచేసి విజయ ఢంకా మోగించారు.
మలబార్‌హిల్‌లో ఏడోసారి మంగల్ ప్రభాత్ లోధా జయకేతనం
మలబార్ హిల్ అసెంబ్లీ నియోజక వర్గంలో మంగళ్‌ప్రభాత్ లోధా ఏడో సారి విజయం సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బీజేపీ తరపున బరిలోకి దిగిన లోధా తన ప్రత్యర్థి, శివసేన(యూబీటీ)అభ్యర్ధి భేరులాల్ చౌధరీపై 6,8091 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రాష్ట్రంలో అత్యంత ధనిక అసెంబ్లీ నియోజకవర్గంగా పేరుగాంచిన మలబార్ హిల్‌లో గెలవడం అంత సులువు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి అధికార నివాసమైన వర్షా బంగ్లాతోపాటు అనేకమంది ఉన్నత వర్గాల నివాసాలు, ధనవంతుల బంగ్లాలుంటాయి. ఇక్కడ సామాన్యులతోపాటు గుజరాతి, జైన్, మార్వాడి వర్గాల ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. లోధా, చౌధరి ఇరువురు జైన్ సమాజానికి చెందినవారు. దీంతో గుజరాతీ, జైన్, మార్వాడి ఓట్లు తమకే దక్కుతాయన్న ఆలోచనతో ఇరువురు ఎన్నికల బరిలోకి దిగారు.లోధాను ఓడించాలని మహావికాస్ ఆఘాడీకి చెందిన బడా నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. ఎట్టకేలకు లోధా విజయకేతనం ఎగురవేశారు.
వరుసగా ఐదుసార్లు ఫడ్నవీస్, ఛగన్ భుజబల్ విజయదుందుభి...
‘నేను మళ్లీ వస్తాను’అంటూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దక్షిణ–పశ్చిమ నాగ్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఏకంగా ఆరు సార్లు విజయ కేతనం ఎగురవేశారు. తనకు ప్రత్యర్థిగా నిలిచిన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ప్రపుల్ గుడధేను 39,710 ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. ఎన్సీపీ అజీత్ పవార్ వర్గానికి చెందిన ఛగన్ భుజబల్ యేవ్‌లా అసెంబ్లీ నియోజక వర్గంలో వరుసగా ఐదుసార్లు విజయదుందుభి మోగించారు. తన ప్రత్యర్ధి ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి మాణిక్‌రావ్ శిందేను 26,400 ఓట్ల అధిక్యంతో భుజబల్ ఓడించారు.
నాలుగుసార్లుగా ఏక్‌నాథ్ శిందే, జితేంద్ర అవ్హాడ్ విజయం..
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే 2009 నుంచి విజయ ఢంకా మోగిస్తూ వస్తున్నారు. థానేలోని కోప్రి–పాచ్‌పాఖాడీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తున్నారు. రెండున్నరేళ్ల కిందట ఉద్ధవ్ శివసేన నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. పార్టీలో చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలెలా ఉండనున్నాయనే అంశం అందరిలోనూ ఉత్కంఠ రేపాయి. ఈ నేపథ్యంలో తన పంథాను కొనసాగిస్తూ శివసేన(శిందే) అభ్యర్ధి కేదార్ దిఘేపై ఘన విజయం సాధించారు. దీంతో వరుసగా నాలుగుసార్లు ఆయన ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించినట్లైంది.
ముంబై ఉప నగరమైన ముంబ్రా–కల్వా అసెంబ్లీ నియోజక వర్గంలో గురుశిష్యులు నజీబ్ ముల్లా , జితేంద్ర అవ్హాడ్ మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. చివరకు ఎన్సీపీ (ఎస్పీ)అభ్యర్థి జితేంద్ర అవ్హాడ్‌ను నాలుగోసారి విజయం వరించింది. 2023లో ఎన్సీపీ రెండుగా చీలిపోవడంతో ఎస్పీ వర్గం నుంచి అవ్హాడ్‌కు అభ్యరి్ధత్వం లభించింది. దీంతో ఆగ్రహానికి గురైన నజీబ్ ఆయనకు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఒకేపార్టీకి చెందిన గురు, శిష్యుల మధ్య పోటీ ఎలా ఉండబోతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా ఇక్కడ ముస్లీం ఓటర్ల సంఖ్య అధికం. దీంతో ముల్లా విజయం ఖాయమని భావించారు. కాని గత 15 ఏళ్ల నుంచి అవ్హాడ్ చేసిన అభివద్ధి పనులే ఆయనకు విజయం చేకూర్చాయి.
విక్రోలీ, కలీనా, దిండోషీ, శివ్డీల్లో హ్యాట్రిక్
విక్రోలీ అసెంబ్లీ నియోజక వర్గంలో మహా వికాస్ ఆఘాడి కూటమి, శివసేన(యూబీటీ) అభ్యర్ధి సునీల్ రావుత్ మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే , ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే . హోరాహోరీగా ప్రచారం చేసినప్పటికీ . చివరకు ఓటర్లు శివసేన(శిందే)అభ్యర్థి సువర్ణ కరంజేకు పట్టం కట్టారు. కలీనా అసెంబ్లీ నియోజక వర్గంలో మహా వికాస్ ఆఘాడి కూటమి యూబీటీ అభ్యర్ధి సంజయ్ పోతి్నస్ హ్యాట్రిక్ సాధించారు. తన ప్రత్యర్ధి అయిన బీజేపీ అభ్యర్ధి అమర్‌జీత్ సింగ్‌ను భారీ అధిక్యంతో ఓడించారు. ఒక్కడ ఎమ్మెన్నెస్, వంచిత్ ఆఘాడీ పార్టీ సహా మొత్తం 16 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నప్పటికీ పోత్నీస్ జయకేతనం ఎగరేశారు.
దిండోషీ అసెంబ్లీ నియోజక వర్గంలో శివసేన(యూబీటీ)అభ్యర్థి సునీల్ ప్రభు భారీ మెజారిటీతో హ్యాట్రిక్ సాధించారు. తన ప్రత్యర్థి శివసేన(శిందే) అభ్యర్థి సంజయ్ నిరుపమ్‌ను 6,058 ఓట్ల తేడాతో ఓడించారు. శివ్డీ అసెంబ్లీ నియోజక వర్గంలో యూబీటీ అభ్యర్ధి అజయ్ చౌధరి హ్యాట్రిక్ సాధించారు. ఎమ్మెన్నెస్ అభ్యర్థి బాలా నాంద్‌గావ్కర్, బీజేపీ రెబల్ అభ్యర్ధి నానా అంబోలే ఇరువురినీ ఓడించి 7,140 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. బాలా నాంద్‌గావ్కర్‌ను గెలిపించేందుకు స్వయంగా రాజ్ ఠాక్రే ప్రత్యేకంగా అక్కడ ఓ సభ నిర్వహించారు. అయినప్పటికీ ఓటర్లు ఆయన్ను తిరస్కరించారు.
న్యూముంబైలోని బేలాపూర్‌లో బీజేపీ అభ్యర్ధి మందా మాత్రే, ఎన్సీపీ (ఎస్పీ) వర్గం అభ్యర్ధి సందీప్ నాయిక్‌ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇద్దరినీ తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. చివరి రౌండ్ వరకు ఇద్దరూ దాదాపు సమానంగా ఉన్నారు. కానీ చివరి రౌండ్ ముగిసే సరికి కేవలం 377 ఓట్ల తేడాతో మందా మాత్రే విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment