
లాక్‌డౌన్ కారణంగా నిర్మానుష్యంగా మారిన నాగ్‌పూర్‌లోని ఓ రహదారి
న్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్ ముంగిట్లో మహారాష్ట్ర ఉందని కేంద్ర బృందం తన నివేదికలో హెచ్చరించింది. కరోనా కట్టడికి అత్యంత ప్రధానమైన ట్రాక్, టెస్ట్, ట్రీట్ విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సరిగా పాటించడం లేదని నివేదికలో పేర్కొంది. కరోనా రోగుల్ని కలుసుకున్న వారెక్కడున్నారో వెతికి పట్టుకొని క్వారంటైన్ చేయడంలో శ్రద్ధ చూపించడం లేదని తెలిపింది. ఇక గ్రామాలు, నగరాలు అన్న తేడా లేకుండా ప్రజలందరూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మహారాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం ఒక లేఖ రాశారు. రాత్రిపూట కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్‌లు ఇక లాభం లేదని, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో కరోనా విజృంభిస్తే ఆరోగ్య రంగంలో సదుపాయాల్ని పెంచాలని మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామ్ కుంతేకి రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు. మార్చి 7–11 తేదీల మధ్య కేంద్ర బృందం మహారాష్ట్రలో పర్యటించింది. గత ఏడాది ఆగస్టు–సెప్టెంబర్ నాటి కోవిడ్ ఆంక్షల్ని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదవుతున్న 10 జిల్లాల్లో ఎనిమిది మహారాష్ట్రలో ఉండడం కరోనా తీవ్రతకు అద్దంపడుతోందని, సామాజిక వ్యాప్తి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో సోమవారం ఒక్క రోజే 15,051 కేసులు నమోదయ్యాయి. గత నెల రోజుల్లోనే యాక్టివ్ కేసుల సంఖ్య 172% పెరిగిపోయాయి. మరోవైపు మహారాష్ట్రకి 2.20 కోట్ల టీకా డోసులు కావాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
గుజరాత్, మధ్యప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ
మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కూడా కరోనా కేసులు అధికమవుతూ ఉండడంతో నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తున్నారు. అహ్మదాబాద్, వడోదరా, సూరత్, రాజ్‌కోటలలో రాత్రిపూట కర్ఫ్యూని మార్చి 31 వరకు పొడిగించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, జబల్‌పూర్, గ్వాలియర్, ఉజ్జయిని, రాత్లాం, బర్హాన్‌పూర్, చింద్వారాలలో మార్చి 17 నుంచి రాత్రి పూట కర్ఫ్యూని అమలు చేయనున్నారు. మధ్యప్రదేశ్‌లో ఇంచుమించుగా రోజుకి వెయ్యి కేసుల వరకు నమోదవుతున్నాయి. దేశంలో కోవిడ్ మహమ్మారితో తలెత్తిన పరిస్థితులు, వ్యాక్సినేషన్ తీరుతెన్నులపై ప్రధాని మోదీ నేడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా చర్చించనున్నారు.
24,492 కొత్త కేసులు
దేశంలో గత 24 గంటల్లో 24,492 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,09,831కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. అదే సమయంలో కోవిడ్ కారణంగా తాజాగా మరో 131 మంది మరణించడంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 1,58,856కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,10,27,543కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 96.65 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,23,432గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 1.96 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.39గా ఉంది. ఇప్పటివరకూ వరకూ 22,82,80,763 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం 8,73,350 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందని చెప్పింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. ఇప్పటివరకూ 2.99 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment