మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉధృతి పెరుగుతుండడంతో మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. అయితే, ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ ప్రకటన చేయడం లేదన్నారు. లాక్‌డౌన్‌కు ప్రత్యామ్నాయం లభించకపోతే రానున్న రెండు మూడు రోజుల్లో కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని స్పష్టం చేశారు. మహారాష్ట్రను కరోనా హడలెత్తిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుతం లాక్‌డౌన్ మినహా ప్రత్యామ్నాయం కనిపించడం లేదన్నారు.
ఏదైనా మార్గం ఉంటే సూచించాలని ప్రజలను కోరారు. తాను కూడా నిపుణులతో దీనిపై చర్చిస్తున్నానని తెలిపారు. ప్రజల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. రాజకీయ పార్టీలు ఈ విషయంపై రాద్ధాంతం చేయకుండా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సహకరించాలని ఉద్ధవ్ ఠాక్రే విన్నవించారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఠాక్రే పేర్కొన్నారు.
దేశంలో ఇతర రాష్ట్రాల కంటే అధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని గుర్తుచేశారు. ఆసుపత్రుల సంఖ్య, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. మళ్లీ లాక్‌డౌన్ విధించాలని తాము కోరుకోవడం లేదన్నారు. నిపుణులతో చర్చించి రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment