నైట్ కర్ప్యూ వేళ నిర్మానుష్యంగా ఉన్న మహారాష్ట్రలోని అమరావతిలోని ఓ రహదారి
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్ విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించారు. నాందేడ్, బీడ్‌తోపాటు మరికొన్ని జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ అమలవుతోంది. పలు జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్‌తోపాటు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. అయినప్పటికీ కరోనా అదుపులోకి రావడం లేదు. అందుకే మళ్లీ లాక్‌డౌన్ విధించడంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.
43 వేలు దాటిన కేసులు
రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ హడలెత్తిస్తోంది. గురువారం ఒక్కరోజే ఏకంగా 43,183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 249 మంది మృతి చెందారు. గురువారం 32,641 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,66,533 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముంబై నగరంలో కరోనా బాధితుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. గురువారం 8,646 కేసులు రికార్డయ్యాయి. 18 మంది కరోనాతో కన్నుమూశారు. ముంబైలో ఆంక్షలను మరింత కఠినతరం చేయడం ఖాయమన్న సంకేతాలను మేయర్ కిషోరి ఫెడ్నేకర్ ఇచ్చారు.
ఇంకా నిర్ణయం తీసుకోలేదు: రాజేష్ టోపే
మహారాష్ట్రలో లాక్‌డౌన్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే చెప్పారు. లాక్‌డౌన్ విధించాలని తాము కోరుకోవడం లేదన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పారు. లాక్‌డౌన్ కాకుండా ఏమేం చేయొచ్చు అనేదానిపై నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment