బలపరీక్షలో నెగ్గాక విజయసంకేతం చూపుతున్న షిండే, ఫడ్నవీస్ తదితరులు
ముంబై: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శాసనసభలో తన ప్రభుత్వ బలాన్ని నిరూపించుకున్నారు. శివసేన తిరుగుబాటువర్గం–బీజేపీ సర్కారుపై తన పట్టును మరింత పెంచుకున్నారు. సోమవారం బల నిరూపణ(విశ్వాస) పరీక్షలో సునాయాసంగా విజయం సాధించారు. ప్రస్తుతం 287 మంది సభ్యులున్న అసెంబ్లీలో షిండే ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 164 మంది, వ్యతిరేకంగా 99 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దాదాపు 263 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
పలువురు వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. రెండు రోజులపాటు జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ముగిశాయి. షిండే ప్రభుత్వానికి వరుసగా రెండో రోజు రెండో విజయం దక్కింది. ఆదివారం నిర్వహించిన స్పీకర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్ నెగ్గిన సంగత తెలిసిందే. బలనిరూపణ కంటే ముందు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పెద్ద షాక్ తగిలింది. ఠాక్రే వర్గంలోని శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగార్ షిండే వర్గంలో చేరిపోయారు. దాంతో వారి సంఖ్యకు 40కి పెరిగింది. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ ఎమ్మెల్యే అజిత్ పవార్ వ్యవహరించనున్నారు.
పార్టీలో నన్ను అణచివేశారు: షిండే
ఓటింగ్‌లో నెగ్గాక షిండే ప్రసంగిస్తూ ఒక దశలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నేరుగా శివసేన పేరెత్తకుండా ఒక పార్టీలో తాను చాలాకాలం అణచివేతకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన మర్యాద దక్కకపోగా అవమానాలే మిగిలాయని అన్నారు. అందుకే తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు. శివసేనతో తన సుదీర్ఘ అనుబంధాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ఈ రోజు జరిగిన పరిణామాలు(విశ్వాస పరీక్షకు దారితీసిన పరిస్థితులు) ఒక్కరోజులో సంభవించినవి కావు. ఒక పార్టీలో నాకు జరిగిన అవమానాలకు ఈ సభలో ఉన్న సభ్యులే సాకు‡్ష్యలు.
నన్ను చాలారోజులపాటు అణగదొక్కారు. సునీల్ ప్రభు(ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యే) సైతం అందుకు సాక్షి’’ అని షిండే ఉద్ఘాటించారు. 2014–19లో బీజేపీ–శివసేన ప్రభుత్వంలో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. చివరకు మాట తప్పారని విమర్శించారు. 2019లో ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసి, చివరకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. నా నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ఇష్టపడడం లేదని శరద్ పవార్ తనతో చెప్పారని అన్నారు. ‘మీరు ముఖ్యమంత్రి కావడానికి మేము వ్యతిరేకంగా కాదు. మీ పార్టీ(శివసేన)లో ఒక యాక్సిడెంట్ జరిగింది’’ అని అజిత్ పవార్ అన్నారని షిండే వివరించారు.
అధికారిక గుర్తింపుందా?: సంజయ్ రౌత్
తిరుగుబాటు వర్గానికి అధికారిక గుర్తింపు ఉందా? అని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రెబల్ వర్గం అసలైన శివసేనను సొంతం చేసుకోలేదని చెప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఎన్నికల్లో నెగ్గడానికి శివసేన గుర్తును వాడుకున్నారని, గెలిచిన తర్వాత ఎన్నో ప్రయోజనాలు పొందారని, చివరకు అదే పార్టీని చీల్చారని ధ్వజమెత్తారు. శివసేన పేరు, గుర్తు ఠాక్రే వర్గానికే దక్కుతుందని, అందుకోసం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. శివసేనకు మరో పేరు ఠాక్రే అని స్పష్టం చేశారు.
శివసేనను అంతం చేసేందుకు కుట్రలు: ఉద్ధవ్
తమ పార్టీని అంతం చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని శివసేన అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే దుయ్యబట్టారు. షిండే ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని సవాలు విసిరారు. సోమవారం శివసేన జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఉద్ధవ్ మాట్లాడారు. శాసనసభను ఏకపక్షంగా నిర్వహించుకోవడం రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని అన్నారు. ఇకనైనా ఆటలు కట్టిపెట్టాలని బీజేపీకి సూచించారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్దామని అన్నారు. తప్పు ఎవరిదైతే ప్రజలు వారిని ఇంటికి పంపుతారని స్పష్టం చేశారు. తాను త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, ప్రజల్లోకి వెళ్తానని ఉద్ధవ్ ఠాక్రే వివరించారు.
ఠాక్రే వర్గం తాజా పిటిషన్‌పై 11న ‘సుప్రీం’ విచారణ
శివసేన రెబల్ ఎమ్మెల్యే భరత్ గోవాలేను పార్టీ కొత్త చీఫ్ విప్‌గా గుర్తిస్తూ అసెంబ్లీ నూతన స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 11న విచారణ చేపడతామని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన వెకేషన్ వెంచ్ వెల్లడించింది.
చదవండి: ‘మహా’ స్పీకర్‌గా నర్వేకర్.. అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు!
Comments
Please login to add a commentAdd a comment