
అది 2021 డిసెంబర్ నాటి ఘటన. మహారాష్టలోని పూణేలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. 63 ఏళ్ల దత్తాత్రేయ విష్ణు తాంబే ఇంటికి దూరమయ్యాడు. అతను ఎక్కడకు వెళ్లాడనే విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియలేదు. అతనికోసం తెలిసిన అన్నిచోట్లా గాలించారు. విసిగివేసారి ఏదోఒక రోజు అతనే ఇంటికి తిరిగి వస్తాడని భావిస్తూ, కుటుంబసభ్యులు కాలం గడుపుతున్నారు.
అయితే తాజాగా విష్ణు తాంబే కుటుంబ సభ్యులకు ఆనందం కలిగించే వార్త వినిపించింది. దత్తాత్రేయ విష్ణు తాంబే అధికార శివసేన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని ఒక ప్రకటనలో కనిపించడం అతని కుటుంబ సభ్యులకు ఆనందం కలిగింది. శివసేన ఇన్‌స్టా ఖాతాలోని ప్రకటనలో కనిపిస్తున్నది దత్తాత్రేయ విష్ణు తాంబే అని అతని కుటుంబం తెలిపింది.
వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని ‘మహాయుతి’ ప్రభుత్వం ఇటీవల ముఖ్యమంత్రి తీర్థ దర్శన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలకు వెళ్లేందుకు సీనియర్ సిటిజన్లకు రూ.30,000 వరకు సబ్సిడీ అందించనున్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంపై జోరుగా ప్రచారం సాగిస్తోంది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం దత్తాత్రేయ విష్ణు తాంబే కుమారుడు భరత్ ఇటీవల శివసేన ప్రకటనను చూసి షాక్ అయ్యాడు. దానిని ఒక స్నేహితుడు తనకు వాట్సాప్‌లో పంపాడని తెలిపారు. షిక్రాపూర్‌లో తినుబండారాల దుకాణం నడుపుతున్న భరత్ మాట్లాడుతూ ‘ఆ స్క్రీన్‌షాట్ చూశాను. నేను వెంటనే నమ్మలేకపోయాను. ప్రభుత్వ తీర్థ దర్శన్ పథకం ప్రకటనలో మా నాన్న కనిపించారు’ అని అన్నారు.
కాగా తమ తండ్రిని తమను కలపాలని భరత్ సీఎం షిండేను కోరారు. తమ తండ్రి సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నాడని తెలుసుకుని తామంతా సంతోషపడుతున్నామన్నారు. షిక్రాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దీపారాతన్ గైక్వాడ్ మాట్లాడుతూ భరత్ తమను సంప్రదించి, తన తండ్రి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారన్నారు. డీఎస్పీ ప్రశాంత్ ధోలే మాట్లాడుతూ తాము దత్తాత్రేయ విష్ణు తాంబే కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు, వారు గతంలో చాలాసార్లు దత్తాత్రేయ విష్ణు తాంబే తమకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయేవాడని, తరువాత తనంతట తానే తిరివచ్చేవారని పేర్కొన్నారన్నారు. దత్తాత్రేయ విష్ణు తాంబే చివరిసారిగా 2021, డిసెంబర్‌లో కరోనా సమయంలో ఇంటి నుండి వెళ్లిపోయాడు. అతను ఏదో ఒకరోజు తిరిగివస్తాడని భావించి కుటుంబ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment