న్యూఢిల్లీ: మణిపూర్‌లో జాతుల మధ్య వైరంలో మహిళలు సమిధలుగా మారిన వైనాన్ని సర్వోన్నత న్యాయస్థానం మరోమారు తీవ్రంగా తప్పుబట్టింది. మే నాలుగో తేదీన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరులో తిప్పిన ఘటనకు సంబంధించిన కేసుల విచారణ సందర్భంగా మణిపూర్‌లో శాంతిభద్రతలు, పోలీసుల పనితీరును సుప్రీంకోర్టు తూర్పారబట్టింది. సోమవారం జరిగిన కేసుల వాదోపవాదాలు మంగళవారమూ కొనసాగాయి. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందించింది. ‘ కేసులను సమర్థవంతంగా దర్యాప్తుచేయలేని స్థితిలో పోలీసులున్నారు.
దర్యాప్తులో దమ్ము, చురుకుతనం లేదు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనల్లో ఆరువేలకుపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదైతే ఎంత మందిని అరెస్టుచేశారు? నగ్న పరేడ్‌కు సంబంధించిన జీరో ఎఫ్‌ఐఆర్, సాధారణ ఎఫ్‌ఐఆర్, పూర్తి వివరాలు ఉన్నాయా ? హేయమైన ఘటన జరిగిన చాలా రోజులకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కొన్ని ప్రాంతాల్లోకి పోలీసులు కూడా వెళ్లలేని అసమర్థత. పరిస్థితి చేయి దాటడంతో అరెస్టులు చేయలేని దుస్థితి. అక్కడ అసలు శాంతిభద్రతలు అనేవే లేవు. రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలింది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
6,523 ఎఫ్‌ఐఆర్‌ల నమోదు
కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. ‘ మేలో హింస మొదలైననాటి నుంచి ఇప్పటిదాకా 6,523 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. నగ్న పరేడ్ ఉదంతంలో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసులో జువెనైల్‌సహా ఏడుగురిని అరెస్ట్‌చేశారు. ఘటన తర్వాత బాధిత మహిళల వాంగ్మూలం తీసుకున్నారు’ అని తెలిపారు. ఈ కేసులో 11 కేసులను సీబీఐకి బదిలీచేస్తున్నట్ల అట్నారీ జనరల్ ఆర్.వెంకటరమణి తెలిపారు.
కాగా, వాంగ్మూలాల కోసం ఆ మహిళలను మళ్లీ విచారించవద్దని సీబీఐకు కోర్టు సూచించింది. తమ ముందు హాజరుకావాలని బాధిత మహిళలను సీబీఐ ఆదేశించిందన్న అంశాన్ని వారి లాయర్ నిజాం పాషా మంగళవారం కోర్టు దృష్టికి తీసుకురావడంతో ధర్మాసనం పై విధంగా మౌఖిక ఆదేశాలిచ్చింది. ఏడో తేదీ(సోమవారం రోజు)న స్వయంగా హాజరై వివరాలు తెలపాలని మణిపూర్ డీజీపీని కోర్టు ఆదేశించింది. 6,523 కేసుల్లో హత్య, రేప్, బెదిరింపులు, లూటీలు, విధ్వంసం ఇలా వేర్వేరుగా కేసులను విభజించి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment