Manipur violence: మణిపూర్‌ దురాగతం.. భయానకం | Manipur violence: SC Takes Stock Of Manipur Atrocities | Sakshi
Sakshi News home page

Manipur violence: మణిపూర్‌ దురాగతం.. భయానకం

Published Tue, Aug 1 2023 4:46 AM | Last Updated on Tue, Aug 1 2023 4:46 AM

Manipur violence: SC Takes Stock Of Manipur Atrocities - Sakshi

న్యూఢిల్లీ: మణిపూర్‌లో మహిళల పట్ల జరుగుతున్న దారుణాలు తీవ్ర ఆందోళనకరమని, ఇవి అసాధారణమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం నిజంగా భయంకరమైన సంఘటన అని పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లో మహిళలపై చోటుచేసుకున్న దురాగతాలను మణిపూర్‌ మహిళల అంశంతో సమానంగా చూడలేమని వెల్లడించింది. పశి్చమ బెంగాల్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ తదితర బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో మహిళలపై ఎన్నో ఘోరాలు జరిగాయని, వారికి అవమానాలు ఎదురయ్యాయని, దీనిపై విచారణ జరపాలని కోరుతూ లాయర్, బీజేపీ నేత బాన్సురీ స్వరాజ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీంతోపాటు మణిపూర్‌ హింసకు సంబంధించిన ఇతర పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. బాన్సురీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. రక్షిస్తే దేశంలోని మహిళలనందరినీ రక్షించండి, లేకపోతే ఎవరినీ రక్షించకండి అని చెబుతున్నారా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల్లో కూడా మహిళలపై హింస జరుగుతోందంటూ మణిపూర్‌లో జరిగిన దారుణాలను సమర్థించుకోలేరని ఘాటుగా వ్యాఖ్యానించింది. మహిళలపై హింస అనేది దేశమంతటా జరుగుతోందని, స్వరాజ్‌ పిటిషన్‌పై తర్వాత దృష్టి సారిస్తామని పేర్కొంది. మణిపూర్‌ విచారణ విషయంలో తమకు సహకరించాలని భావిస్తే సహకరించవచ్చని స్వరాజ్‌కు సూచించింది.  

నమోదు చేసిన కేసులెన్ని?
ఇద్దరు బాధిత మహిళల తరపున సీనియర్‌ లాయర్‌ కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. రాష్ట్రంలో హింసకు సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయో కూడా ప్రభుత్వం వద్ద వివరాలు లేవని ఆక్షేపించారు. మణిపూర్‌ మారణకాండపై దర్యాప్తును సుప్రీంకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. దీంతో మణిపూర్‌ హింసపై కేంద్ర ప్రభుత్వానికి, మణిపూర్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం 6 ప్రశ్నలు సంధించింది. 24 గంటల్లో వాటికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

1.రాష్ట్రంలో హింసాకాండకు సంబంధించి ఇప్పటిదాకా మొత్తం ఎన్ని కేసులు నమోదు చేశారు?
2.వీటిలో జీరో ఎఫ్‌ఐఆర్‌లు ఎన్ని?
3.ఇతర పోలీసు స్టేషన్లకు ఎన్ని కేసులను బదిలీ చేశారు?
4.ఇప్పటివరకు ఎంతమందిని అరెస్టు చేశారు?
5.అరెస్టయిన నిందితులకు అందించిన న్యాయ సహాయం పరిస్థితి ఏమిటి?
6.సెక్షన్‌ 164 కింద రికార్డు చేసిన స్టేట్‌మెంట్లు ఎన్ని?

అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. మణిపూర్‌ ఘటనలపై దర్యాప్తును పర్యవేక్షించడానికి రిటైర్డ్‌ న్యాయమూర్తులతో ఒక కమిటీని లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలన్న ఆలోచన వస్తోందని వివరించింది.   

పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం  
మణిపూర్‌లో చోటుచేసుకున్న హింసతోపాటు రాష్ట్రంలో అడవుల నరికివేత, గంజాయి సాగు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)తో దర్యాప్తు జరిపించాలని కోరుతూ తాజాగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తిరస్కరించింది. మాయాంగ్లాంబమ్‌ బాబీ మైతేయి తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ మాధవి దివాన్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), జాతీయ మానవ హక్కుల సంఘం, మణిపూర్‌ ప్రభుత్వాన్ని ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. కేవలం ఓ వర్గంపై నిందలు వేసేలా ఉన్న ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టలేమని ధర్మాసనం తేలి్చచెప్పింది.

 14 రోజులు ఏం చేశారు?  
ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం అనేది నిర్భయ తరహా కేసు కాదని, ఇది వ్యవస్థీకృతంగా జరిగిన హింస అని వెల్లడించింది. మే 4న సంఘటన జరిగితే, మే 18న కేసు పెట్టారని, మధ్యలో 14 రోజులపాటు ఏం చేశారని ప్రభుత్వాన్ని నిలదీసింది. బాధిత మహిళలను రాష్ట్ర పోలీసులే చేజేతులా రాక్షస మూకకు అప్పగించినట్లుగా ఉందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ కేసులో ఇప్పటిదాకా ఏయే చర్యలు తీసుకున్నారో తమకు నివేదిక               సమరి్పంచాలని మణిపూర్‌ పోలీసులను ఆదేశించింది. మణిపూర్‌ హింస కేసులో తాము ఎంతవరకు జోక్యం చేసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ స్పందనపై ఆధారపడి ఉంటుందని ధర్మాసనం తేలి్చచెప్పింది. ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా ఉంటే తాము జోక్యం చేసుకోబోమంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement