సాక్షి, ఢిల్లీ: గత రెండు నెలలుగా అల్లర్లు, హింసతో రగిలిపోతున్న మణిపూర్ పరిణామాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. న్యాయస్థానాన్ని వేదికగా ఉపయోగించుకొని మరింత ఉద్రిక్తతలు పెంచలేరంటూ పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. మణిపూర్‌లో శాంతి భద్రతల పరిరక్షణకై ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంలో దాఖలైన పలు పిటిషన్లపై.. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి కీలక వ్యాఖ్యలు చేసింది.
శాంతి భద్రతలు తమ పరిధిలోని అంశం కాదని.. అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ పీఎస్ నరసింహా ఈ పిటిషన్లను విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కూకీ తెగ తరపున సీనియర్ న్యాయవాది కోలిన్ గోంజల్వేస్ బెంచ్ ముందు వాదనలు వినిపిస్తూ.. ‘‘దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని, ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితుల్ని సాధారణ స్థితికి తేవాలని కోరారు. అంతేకాదు ఇది ప్రభుత్వమే జరిపిస్తున్న అల్లర్లంటూ సంచలన ఆరోపణలు చేశారాయన.
ఈ క్రమంలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందిస్తూ.. మణిపూర్‌లో ఉద్రిక్తతలను మరింత పెంచడానికి కోర్టును మీరు ఉపయోగించుకోలేరంటూ వ్యాఖ్యానించారాయన. ‘‘అఫ్‌కోర్స్.. సుప్రీం కోర్టుకు అపారమైన అధికారమే ఉంది. కానీ, దానిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగిస్తాం. ఒక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మా పని కాదు. అది అక్కడి ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానిదేనని అన్నారు.
ఇదిలా ఉంటే.. అడ్వొకేట్ కోలిన్ గోంజల్వేస్ మణిపూర్‌లోని బీజేపీ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయుధ వర్గాలను ప్రభుత్వమే వెన్నుతట్టి ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో మళ్లీ జోక్యం చేసుకున్న సీజేఐ.. ఇది తీవ్ర సంక్షోభమేనని, చేతనైంతలోనే తామ చేసేది చేయగలమని, అంతేగానీ శాంతి భద్రతల పరిరక్షణ మాత్రం పర్యవేక్షించలేమని, అవసరం అనుకుంటే నిర్మాణాత్మక సూచనలతో రావాలని పిటిషనర్ల తరపు అడ్వొకేట్‌కు సూచించారు. ఈ క్రమంలో రేపు(మంగళవారం) మరోసారి పిటిషన్లపై సీజే బెంచ్ వాదనలు విననుంది.
ఇదిలా ఉంటే మే నెల నుంచి ఇప్పటిదాకా.. మణిపూర్‌లో కుకీ-మెయితీ తెగల మధ్య వైరం 150 మంది ప్రాణాలను బలిగొంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఒక నివేదిక సమర్పించాలని మణిపూర్ సీఎస్‌ను సుప్రీం కోర్టు గతవారం ఆదేశించింది. అంతకాదు శరణార్థుల పరిస్థితిపైనా నివేదిక ఇవ్వాలని కోరింది.
ఇదీ చదవండి: గులా‘బీ టీమ్’ గందరగోళం ఎట్లా?
Comments
Please login to add a commentAdd a comment