![Ministers Manish Sisodia, Satyender Jain Condemn Oxygen Shortage Deaths Statement - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/21/oxygen-shortage-deaths.jpg.webp?itok=24Thz76Y)
ఫైల్ ఫొటో
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ రెండో దశ ఈ ఏడు దేశాన్ని గజగజ వణికించింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన విషయం తెలిసిందే. కేసులు రెండు లక్షలు దాటగా.. మృతుల సంఖ్య పదివేలు దాటడం కల్లోలం సృష్టించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా వైద్యారోగ్య సేవలు కరువయ్యాయి. ముఖ్యంగా ప్రాణవాయువు ఆక్సిజన్ తీవ్రంగా వేధించింది. ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక వందలాది మృతి చెందారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆక్సిజన్ కొరతతో ఎవరూ మృతి చెందలేదని తాజాగా మంగళవారం ప్రకటించడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు రాష్ట్రాల మంత్రులు కేంద్ర ప్రకటన ‘పచ్చి అబద్ధం’ అని ప్రకటిస్తున్నారు.
కేంద్ర ప్రకటనపై ఢిల్లీ, కర్ణాటక మంత్రులు స్పందించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పందించారు. ఈ ప్రకటన ‘పూర్తి అవాస్తవం’ అని పేర్కొన్నారు. చాలా మరణాలు ఆక్సిజన్ కొరతతో సంభవించాయని బుధవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సత్యేందర్ జైన్ తెలిపారు. ఆక్సిజన్ కొరతతో మరణాలు లేకుంటే ఆస్పత్రులు ఎందుకు హైకోర్టులను ఆశ్రయిస్తున్నాయి? అని ప్రశ్నించారు. ఆస్పత్రులు, మీడియా ఆక్సిజన్ కొరత వార్తలను చూస్తునే ఉన్నాయి. ఆక్సిజన్ మరణాలు సంభవిస్తున్నాయని టీవీ ఛానల్స్ కూడా ప్రసారం చేశాయా లేదా అని నిలదీశారు. కళ్లారా మరణాలను చూశామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. ఇలాగే ఉంటే త్వరలోనే కరోనా వైరస్ కూడా లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని సత్యేందర్ జైన్ ఎద్దేవా చేశారు.
కర్ణాటకలో అయితే ఆక్సిజన్ మరణాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఒక్క జిల్లాలోనే (చామరాజ్‌నగర్ జిల్లా ఆస్పత్రి) 36 మంది ఆక్సిజన్ కొరతతో మరణించారని ఓ నివేదిక ధర్మాసనానికి చేరింది. ఈ నివేదికను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీఎన్ అశ్వత్‌నారాయణ్ ఖండించారు. అవి ఆక్సిజన్ మరణాలు కాదని.. ఆ ఆస్పత్రి నిర్లక్ష్యంతో సంభవించిన మరణాలుగా అభివర్ణించారు. ‘ఆ మరణాలు ఆక్సిజన్‌తో జరగలేదు. దీనిపై విచారణ కొనసాగుతోంది’ అని తెలిపారు.
‘గుడ్డిగా కేంద్రం ప్రభుత్వం అనాలోచితంగా చేసిన ప్రకటన’ అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ తెలిపారు. ‘చాలామంది తమ ఆత్మీయులు, బంధువులను ఆక్సిజన్ కొరతతో కోల్పోయారు. ఆస్పత్రులు, మీడియా వీటిని రోజూ చూస్తూనే ఉన్నాయి. ఆక్సిజన్ కొరతతో మరణించారని టీవీల్లో ప్రసారాలు వచ్చాయి’ అని తెలిపారు. ఈ అంశంపై వేణుగోపాల్ రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ పిటిషన్ వేశారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటన చేసిందని.. తప్పించుకునే ధోరణిలో చేసిన ప్రకటనగా ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. కరోనా మృతులకు నష్ట పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పించుకోవడానికి ఈ ప్రకటన చేసిందని గుర్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment