ముంబై: హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో జైలుపాలై.. బెయిల్ మీద విడుదలైన ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు మళ్లీ చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జంటకు బెయిల్ రద్దు చేయాలంటూ ముంబై పోలీసులు సోమవారం స్పెషల్ కోర్టును ఆశ్రయించారు.
ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ప్రత్యేక న్యాయస్థానం. అయితే.. షరతుల్లో ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దన్న కూడా స్పష్టం చేసింది. ఒకవేళ మాట్లాడితే గనుక బెయిల్ దానంతట అదే రద్దు అయిపోతుందని హెచ్చరించింది కూడా. ఈ నేపథ్యంలో..
వాళ్లు మీడియాతో మాట్లాడినందుకుగానూ బెయిల్ రద్దు చేయాలని, అంతేకాదు వాళ్లమీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు తమ అభ్యర్థన పిటిషన్‌లో ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ముంబై పోలీసుల దరఖాస్తుపై స్పందించాలంటూ నవనీత్ కౌర్ దంపతులకు నోటీసులు జారీ చేసింది.
హనుమాన్ చాలీసా ఛాలెంజ్‌తో సీఎం ఉద్దవ్ థాక్రేకు ఎదురెళ్లిన ఈ ఇండిపెండెంట్ ప్రజా ప్రతినిధుల జంట.. రెచ్చగొట్టే చర్యల మీద అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. అయితే వీళ్ల బెయిల్‌ను సవాల్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. ఈ లోపు.. ఢిల్లీలో ఈ జంట వరుసబెట్టి ప్రెస్ మీట్‌లు పెడుతోంది. పైగా సీఎం ఉద్దవ్ థాక్రేకు చాలెంజ్‌లు విసిరింది. మీడియాతో మాట్లాడడమే కాకుండా.. మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నందుకుగానూ బెయిల్ రద్దు చేయాలంటూ ఖర్ పోలీస్ స్టేషన్ ఎస్సై.. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘారత్ ద్వారా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
ఈ జంట ప్రెస్ మీట్‌లకు సంబంధించిన వీడియోలను కోర్టు సైతం పరిశీలించినట్లు సమాచారం. దీంతో నవనీత్ కౌర్, ఆమె భర్త గనుక సరైన వివరణ ఇవ్వకుంటే మాత్రం వెంటనే అరెస్ట్ దిశగా కోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment