సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, కాజీపేట్,వరంగల్, ఖమ్మం.... ఇలాంటి ప్రముఖ రైల్వే స్టేషన్లు ఎప్పుడు స్థాపించారు.. ఎలా ఆవిర్భవించాయి ?.. వాటి పుట్టుకలో కీలక భూమిక ఎవరిది..?.. నాటి ఏ పరిస్థితి వల్ల అక్కడ స్టేషన్ ఏర్పాటైంది? –ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఇలాంటి వివరాల సేకరణలో తలమునకలై ఉన్నారు. ప్రత్యేకంగా కొంతమందిని ఇందుకోసం పురమాయించారు. సదరు సిబ్బంది ఆ వివరాల సేకరణకు ఉరుకులు పరుగులు మొదలుపెట్టారు. ఏ స్టేషన్ ఎప్పుడు ఏర్పడిందో వివరాలు తెలిస్తే.. వాటి పుట్టిన రోజు (ఆవిర్భావ దినోత్సవం) వేడుకలు నిర్వహిస్తారట.
మోదీ చేసినప్రస్తావనే ఆదేశంగా భావిస్తూ..
ఇటీవల దేశవ్యాప్తంగా తొమ్మిది వందేభారత్ రైళ్లను రైల్వే శాఖ పట్టాలెక్కించింది. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జెండా ఊపి వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన, ప్రజలను రైల్వేకు మరింత చేరువ చేసే క్రమంలో రైల్వే స్టేషన్లకు పుట్టినరోజు వేడుకలు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. తమిళనాడులోకి కోయంబత్తూరు, ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్ల భవనాలకు ఇటీవల స్థానిక రైల్వే అధికారులు ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు.
వీటిని ఉదహరించిన మోదీ, మిగతా వాటికి కూడా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కానీ, విధానపరంగా అలాంటి నిర్ణయం ఇప్పటి వరకు లేదని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నట్టుండి ప్రధాని స్వయంగా పేర్కొనేసరికి, వెంటనే కొన్ని స్టేషన్ భవనాలకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని, ఆయా స్టేషన్లతో అనుబంధం ఉన్న ప్రముఖులు, సాధారణ ప్రయాణికులను పెద్ద సంఖ్యలో పిలిపించి అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో, సమీపంలో ఏయే స్టేషన్ల ఆవిర్భావ రోజులున్నాయో గుర్తించే పనిలో పడ్డారు.
వివరాలు సేకరిస్తున్నాం
‘‘రెండు స్టేషన్ల పుట్టినరోజు వేడుకలను ప్రధాని స్వయంగా ప్రస్తావించారు. కానీ, ఇప్పటి వరకు మాకు అలాంటి నిర్ణయంపై సమాచారం లేదు. ప్రధాని స్వయంగా చెప్పారంటే, ఆదేశాలతో సంబంధం లేకుండా మేం నిర్వహించాల్సిందే. అందుకే వివరాలు సేకరిస్తున్నాం’ అని ఓ ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment