
ముంబై : ఓ కార్టూన్ వివాదంపై శివసేన సభ్యులచే దాడికి గురైన రిటైర్డ్ నౌకాదళ అధికారి మదన్ శర్మ బీజేపీ, ఆరెస్సెస్‌లో చేరినట్టు మంగళవారం స్వయంగా వెల్లడించారు. తాను బీజేపీలో చేరానని, మహారాష్ట్రలో ఎలాంటి గూండాగిరి జరగకుండా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారితో తాను సమావేశమయ్యానని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరగా..దీనిపై కేంద్రంతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారని శర్మ తెలిపారు. చట్టం రెండు రకాలుగా ఎందుకు వ్యవహరిస్తోందో అర్ధం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నేతను మరోలా, సాధారణ పౌరుడిని మరో రకంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై దాడి ఘటనను గవర్నర్‌కు వివరించానని, ఈ ఘటనపై నిందితులపై ప్రయోగించిన సెక్షన్లు బలహీనంగా ఉన్నాయని చెప్పానన్నారు. తన వినతిపత్రంపై చర్యలు చేపడతానని గవర్నర్ తనకు హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరగా, కేంద్రంతో మాట్లాడతానని గవర్నర్ భరోసా ఇచ్చారని రిటైర్డ్ నేవీ అధికారి మదన్ శర్మ చెప్పుకొచ్చారు. కాగా ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై కార్టూన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు శర్మపై సేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు సేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి ఆపై బెయిల్‌పై విడుదల చేశారు. చదవండి : ‘కంగనా ఓ మెంటల్ కేసు’