'పట్టు పట్టరాదు పట్టి విడువరాదు.. పట్టెనేని బిగియ పట్టవలయు..' అనే వేమన పద్యం అందరికీ తెలిసే ఉంటుంది. రాజస్థాన్‌కు చెందిన ఓ యువకునికి వేమన చెప్పిన మాటలు సరిగ్గా సరిపోలుతాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రయత్నాన్ని విడువకుండా తన లక్ష‍్యాన్ని చేరుకున్నాడు ఈ కుర్రాడు. ఇంతకీ ఇతను ఏం సాధించాడు. విజయ సాధనలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటో తెలుసుకుందాం పదండి..
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల ఫలితాలు గత వారం విడుదలయ్యాయి. డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకోవడానికి చాలా మంది అభ్యర్థులు పోటీ పడి విజయం సాధించారు. ఇందులో రాజస్థాన్‌కు చెందిన యువకుడు రామ్‌లాల్ కూడా ఉన్నాడు. ఏకంగా 490 మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అయితే.. నీట్‌లో పాస్ అయినవాళ్లందరి ప్రయత్నం ఓ వైపు.. రామ్‌లాల్ కృషి మరో వైపు..
11 ఏళ్లకే బాల్య వివాహం..
రామ్‌లాల్ చిత్తోర్‌గఢ్‌లోని ఘోసుండా ప్రాంతంలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈ యువకునికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఏదైనా గొప్పగా సాధించాలనే కలలు కనేవాడు. చదువుల్లో మంచిగా రాణిస్తున్న ఇతనికి 11 ఏళ్లకే బలవంతంగా బాల్య వివాహం చేశారు కుటుంబ సభ్యులు. అప్పుడు అతను కేవలం 6వ తరగతి చదువుతున్నాడు.
11 ఏళ్లకు పెళ్లిపీటలెక్కిన రామ్‌లాల్
భార్య సహకారంతో..
తన కల నీరుగారిపోయిందనుకున్న రామ్‌లాల్‌కు భార్య సహకారం తోడయింది. ఆయన భార్య పదో తరగతి వరకు చదువుకుంది. పుస్తకం విలువ తెలిసిన ఆమె భర్తకు అండగా నిలబడింది. రామ్‌లాల్ తండ్రికి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా.. తన భర్త చదువుకోవడానికి పూర్తి తోడ్పాటును అందించింది. దీంతో రామ్‌లాల్ 10వ తరగతిలో 74 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం తనకు ఇష్టమైన సైన్స్ విభాగాన్ని ఎంచుకున్నాడు. నీట్ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు.
అలుపెరుగని ప్రయత్నం..
2019లో మొదటి సారి నీట్ పరీక్షను రామ్‌లాల్ రాశాడు. 720 మార్కులకు గాను 350 వచ్చాయి. మెరుగైన ఫలితాలు రాలేదు. కానీ ఏ మాత్రం క్రుంగిపోకుండా ప్రయత్నాన్ని మళ్లీ మొదలుపెట్టాడు. కోటా నగరానికి చేరుకుని కోచింగ్ సెంటర్‌లో చేరి మెలుకువలు నేర్చుకున్నాడు. ఈ సారి 632 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎంబీబీఎస్ కలను సాకారం చేసుకున్నాడు.
350 మార్కుల నుంచి ఐదో సారికి 632కి చేరుకున్నానని రామ్‌లాల్ చెబుతున్నాడు. కృషి ఉంటే మనుషులు ఏదైనా సాధించవచ్చని అంటున్నాడు. తన భార్య ఇచ్చిన సహకారాన్ని కొనియాడుతున్నాడు. ఇక నీట్ 2023 పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలోనే రామ్‌లాల్ దంపతులకు పాప పుట్టడం మరో విశేషం.
ఇదీ చదవండి: 5 తరాలు, 85 మంది కుటుంబ సభ్యులు.. 102 ఏళ్ల బామ్మకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment