నూతన పార్లమెంట్ హౌస్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్‌లోని ఆరు ద్వారాలకు జంతువుల పేర్లు పెట్టారు. వీటిలో కొన్ని మనకు కనిపించేవి. మరికొన్ని పౌరాణిక సంబంధమైనవి. 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంట్ ద్వారాలకు ఉన్న చిహ్నాలు వివిధ అంశాలను తెలియజేస్తాయి. నేటి కథనంలో ఆ ద్వారాలకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకుందాం.
గజ ద్వారం
నూతన పార్లమెంట్ ప్రాగణ ద్వారానికి గజ ద్వార్ అనే పేరు పెట్టారు. ఈ ద్వారం జ్ఞానం, జ్ఞాపకశక్తి, సంపద, తెలివితేటలను సూచిస్తుంది. ఈ ద్వారం భవనానికి ఉత్తరం వైపున ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశ బుధునికి సంబంధించినది. దీనిని మేధస్సుకు కేంద్రంగా పరిగణిస్తారు. ఈ ద్వారంపై ఏనుగు బొమ్మలు కనిపిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి శ్రేయస్సును, సంతోషాన్ని అందిస్తాయి.
అశ్వ ద్వారం
పార్లమెంట్‌లోని మరో ద్వారానికి అశ్వ ద్వారం అని పేరు పెట్టారు. అశ్వం అంటే గుర్రం. ఇది శక్తి, బలం, ధైర్యానికి చిహ్నం.
గరుడ ద్వారం
మూడవ ద్వారానికి పక్షుల రాజైన గరుడుని పేరు పెట్టారు. గరుడుని విష్ణువు వాహనంగా భావిస్తారు. త్రిమూర్తులలో రక్షకునిగా పేరొందిన విష్ణువుతో అనుబంధం కలిగిన గరుడ పక్షి.. శక్తి, కర్తవ్యాలకు చిహ్నమని చెబుతారు. గరుడ ద్వారం నూతన పార్లమెంటు భవనానికి తూర్పున ఉంది.
మకర ద్వారం
మకర ద్వారం అనేది పురాణాలలో పేర్కొన్న సముద్ర జీవిని గుర్తుచేస్తుంది. ఇది వివిధ జంతువుల కలయిక. మకర శిల్పాలు దక్షిణ, ఆగ్నేయాసియాలో విస్తరించిన హిందూ, బౌద్ధ స్మారక కట్టడాలలో కనిపిస్తాయి. మకరం అనేది వివిధ జీవుల కలయికతో దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. ద్వారాల వద్ద కనిపించే మకర విగ్రహాలను రక్షకులని చెబుతారు. మకర ద్వారం పాత పార్లమెంట్ హౌస్ ప్రవేశ ద్వారం వైపు కనిపిస్తుంది.
శార్దూల ద్వారం
ఐదవ ద్వారానికి పురాణాల్లో పేర్కొన్న శార్దూలం అనే పేరు పెట్టారు. ఇది సింహం శరీరాన్ని కలిగి ఉంటుంది. గుర్రం, ఏనుగు, చిలుక తలను కలిగి ఉంటుంది. కొత్త పార్లమెంట్ భవనం గేటు వద్ద శార్దూలం ఉండటం దేశ ప్రజల బలానికి ప్రతీక అని ప్రభుత్వ నోట్‌లో పేర్కొన్నారు.
హంస గేట్
నూతన పార్లమెంటులోని ఆరవ ద్వారానికి హంస గేట్ అనే పేరు పెట్టారు. జ్ఞాన దేవత అయిన సరస్వతీమాత వాహనంగా హంస గుర్తింపు పొందింది. హంస మోక్షాన్ని సూచిస్తుంది. జనన, మరణ చక్రం నుండి ఆత్మ విముక్తిని సూచిస్తుంది. పార్లమెంటు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న హంస విగ్రహం స్వీయ సాక్షాత్కారానికి, జ్ఞానానికి చిహ్నం.
Comments
Please login to add a commentAdd a comment