భారతదేశ పరిపాలనా వ్యవస్థలో పంచాయతీ, తహసీల్, జిల్లా, రాష్ట్రం, దేశం అనే విభాగాలు ఉన్నాయి. ఇందులో జిల్లాను అత్యంత కీలకంగా పరిగణిస్తారు. ప్రస్తుతం దేశంలో మొత్తం జిల్లాల సంఖ్య 800 దాటింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త జిల్లాలను మైహార్, పంధుర్ణగా పిలవనున్నారు. అయితే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఎలా ఏర్పాటు చేస్తుంది? ఎటువంటి విధానాన్ని అనుసరిస్తుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన స్థానిక పరిపాలన, ఎన్నికైన ప్రతినిధులు, ఇతర సంస్థల నుంచి వస్తుంది. తరువాత దానిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను నిశితంగా పరిశీలిస్తుంది. అనంతరం కొత్త జిల్లా ఆవశ్యకతపై సాధ్యాసాధ్యాలను అధికారులు అధ్యయనం చేస్తారు. ఈ దశలో ఆ ప్రాంత జనాభా, భౌగోళిక పరిసరాలు, పరిపాలనా సౌకర్యాలు, వనరుల లభ్యతతో పాటు, ఆ ప్రాంత సామాజిక పరిస్థితులు మొదలైనవాటిని పరిగణలోకి తీసుకుంటారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన సరైనదని భావించినప్పుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధులతో చర్చిస్తుంది. ఈ సమయంలో అందరి అంగీకారం మేరకు కొత్త జిల్లాను రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనంతరం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందులో కొత్త జిల్లా ఏర్పాటు ప్రకటనతో పాటు జిల్లా సరిహద్దులను తెలియజేస్తారు. జిల్లా సరిహద్దులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత కొత్త జిల్లాకు గవర్నర్ ఆమోదం తెలిపిన అనంతరం కొత్త జిల్లాకు అధికారిక రూపం వస్తుంది.
కొత్త జిల్లా ప్రకటన వెలువడిన తరువాత ప్రభుత్వం ముందుగా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(డీఎం) ఎస్పీలను నియమిస్తుంది. తరువాత క్రమంగా ఇతర అధికారులను నియమిస్తారు. జిల్లా ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పరిపాలనా కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర అవసరమైన సేవలు, ప్రజా సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. దీనితో పాటు, పాత, కొత్త జిల్లాల మధ్య వనరులు, ఆస్తుల పంపిణీ జరుగుతుంది.
ఇది కూడా చదవండి: క్షిపణి దాడుల మధ్య వార్ జోన్‌కు బైడెన్ ఎలా చేరారు?
Comments
Please login to add a commentAdd a comment