లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. జైలు నుంచే పాలన ప్రారంభించారని ఆప్ ప్రకటించుకుంది. ఈడీ లాకప్‌లో ఉన్న ఆయన తొలి ఆదేశాలు సైతం జారీ చేశారని నిన్నంతా హడావిడి చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ తాజా ప్రకటనలతో ఆ ఆదేశాల ప్రకటనపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఢిల్లీ నీటి పారుదల శాఖ మంత్రి ఆతిశీ నిన్న మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ నుంచే పరిపాలన మొదలుపెట్టారు. ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ తొలిసారి అధికారిక ఆదేశాలను జారీ చేశారు. దేశ రాజధానిలో నీటి సరఫరాకు సంబంధించి ఈ ఉత్తర్వులను ఆయన జారీ చేశారు. ఆయన అలా కస్టడీలో ఉండి ఆదేశాలు జారీ చేయటం బాధగా అనిపించింది. శనివారం రాత్రి ఆదేశాలు వచ్చాయని.. అవి తనకు కన్నీళ్లు తెప్పించాయని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అరెస్టైనా.. ఢిల్లీ రెండు కోట్ల ప్రజల కుటుంబ సభ్యుడిగానే ఆయన ఆలోచనలు ఉండడం తనను ఎంతో కదిలిస్తోందంటూ పేర్కొన్నారామె.
‘‘ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీరు, మురుగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నారని నేను తెలుసుకున్నాను. ఈ విషయంపై ఆందోళన చెందుతున్నాను. నేను కస్టడీలో ఉన్నందున ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కోకూడదు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేయాలి’’
అతిశీ మీడియాకు చూపించిన నోట్‌లో కేజ్రీవాల్ పేరిట ఆదేశాల్లో ఉన్న సారాంశం
అయితే.. ఈ కస్టడీ నుంచే తొలి ఆదేశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోలా ప్రకటన చేసింది. లాకప్‌లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ దగ్గర లాప్‌ట్యాప్ లేదు. కనీసం ఆయనకు పేపర్లను కూడా తమ సిబ్బంది అందించలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. అలాంటప్పుడు ఆయన అలాంటి ఆదేశాలేవీ జారీ చేసే అవకాశమే లేదని ఈడీ స్పష్టం చేసింది. ఆ ఆదేశాలపై దృష్టి సారించామని, అసలు ఆ ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో పరిశీలించి కోర్టుకు నివేదిస్తామని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
కస్టడీలో కేజ్రీవాల్‌ను కలిసిందెవరు?
లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్(నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం) అభియోగాలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. కోర్టు రిమాండ్‌తో ఈ నెల 28వ తేదీ వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉంటారు. అప్పటి వరకు ప్రతిరోజూ ఆయన భార్య సునీత, వ్యక్తిగత కార్యదర్శి విభవ్ కుమార్‌లకు మాత్రమే ఆయన్ని కలిసేందుకు అనుమతి ఉంది. అదీ సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటలదాకా మాత్రమే. అలాగే.. లాయర్లకు మరో అరగంట అనుమతి ఉంటుంది. సెంట్రల్ ఢిల్లీలో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం రోడ్‌లో ఈడీ ఆఫీస్‌లో కేజ్రీవాల్ ఉన్నారు. అక్కడి మీటింగ్ హాల్‌లో సీసీటీవీ పర్యవేక్షలోనే ములాఖత్ జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో.. శనివారం సాయంత్రం సునీత, మరికొందరు సిబ్బందితో కలిసి వచ్చారు. ఆమె కొన్ని పేపర్లతో కేజ్రీవాల్ దగ్గరకు వెళ్లారని, ఆ మరుసటి ఉదయమే కేజ్రీవాల్ పేరిట ఆదేశాలను అతిశీ ప్రకటించారని తెలుస్తోంది.
ఇదంతా డ్రామా: బీజేపీ
అయితే లాకప్‌లో ఉన్న కేజ్రీవాల్ పాలన కొనసాగించేందుకు అవకాశమే లేదని.. ఆ ఆదేశాలు కూడా అంతా డ్రామానే అని బీజేపీ మండిపడుతోంది. ఈడీ కస్టడీలో ఉండగా.. ఆ కార్యాలయంలో సీఎం ఆఫీస్ నడిపించడానికి అసలెలా? అనుమతిస్తారని మండిపడుతోంది. ఆహారం, మందుల విషయంలోనూ కోర్టుల అనుమతి అవసరం. అలాంటిది పాలన ఎలా కొనసాగించగలుతున్నారంటూ ప్రశ్నిస్తోంది. ఈడీ లాకప్ ఉన్న కేజ్రీవాల్ ఎవరిని కలిశారు?.. అలాంటి ఆదేశాలకు ప్రిన్సిపల్ సెక్రటరీ మాత్రమే అనుమతి ఉంటుంది కదా. అలాంటప్పుడు ఆ ఆదేశాలు అతీశీకి ఎలా చేరాయి?. పీఎంఎల్‌ఏ కోర్టు ఆదేశాలతోనే ఇదంతా జరుగుతోందా? అనేది ఈడీ దర్యాప్తు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ‘‘ఇదేం లిక్కర్ షాప్ కాదు.. ఎవరైనా బాటిల్ తీసుకోవడానిక. సీఎం ఆఫీస్ సీఎం ఆఫీస్ నుంచే నడవాలి. లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకారం తెలపాలి. కానీ, ఇవేం ఆదేశాలు?’’ అని అతిశీని బీజేపీ ప్రశ్నిస్తోంది.
గవర్నర్ అనుమతి తప్పనిసరి
కేజ్రీవాల్‌కు జైలు నుంచే పాలన సాగించేందుకు చట్టపరంగా ఏ విధమైన అడ్డంకులూ లేవు. కానీ, జైలు నిబంధనలు దీనికి అవరోధాలుగా నిలుస్తాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే.. కేజ్రీవాల్‌ను గృహ నిర్బంధం చేస్తే ఆయనకు పాలన సులభతరం అవుతుందని, అయితే అలా చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే, గతంలో కేజ్రీ, సక్సేనాకు మధ్య అనేక వివాదాలు జరగడం వల్ల ఆయన అనుమతిపై సందిగ్ధం నెలకొంది. కాగా కేజ్రీవాల్ ఇంకా సీఎం పదవికి రాజీనామా చేయకపోవడాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది. ఆయనను తొలగించేందుకు న్యాయపరమైన మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇంకోవైపు ఎల్జీ నిర్ణయంపై కూడా కేజ్రీవాల్ పదవిలో కొనసాగడం ఆధారపడి ఉంటుంది.
కోర్టు అనుమతితోనా?
తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ సింగ్ మాన్.. కేజ్రీవాల్ జైలు నుంచి పాలించడంపై స్పందించారు. జైలుకు వెళ్లినంత మాత్రాన ఎవరూ నేరస్థుడు కాడనేది చట్టమే చెబుతోందని, జైలు నుంచి ముఖ్యమంత్రి పాలన చేయకూడదని కూడా ఎక్కడా లేదని ఆయన అన్నారు. అందుకే జైల్లో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటుకు ఢిల్లీ హైకోర్టు లేదంటే.. సుప్రీంకోర్టు అనుమతి తీసుకుంటామన్నారు.
ఫోనెక్కడ?
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ చెరసాలలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్ కనిపించడంలేదని తెలుస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ఆదివారం దర్యాప్తు అధికారులు నాలుగు గంటలపాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పాలసీ రూపొందించే సమయంలో ఏ ఫోన్ ఉపయోగించారని అధికారులు ప్రశ్నించగా.. తనకు గుర్తులేదని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. దీంతో అందులోనే కీలక ఆధారాలు ఉన్నట్లు ఈడీ భావిస్తోంది. దాన్నుంచి ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రుతో ఆయన మాట్లాడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. మరోవైపు, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన మనీశ్ సిసోదియా వ్యక్తిగత కార్యదర్శి సి.అరవింద్‌తో కలిపి కేజ్రీవాల్‌ను మంగళవారం విచారించనుంది.
ఇక లిక్కర్ స్కాం కేసులో విచారణలో భాగంగా.. గత గురువారం రాత్రి సివిల్ లేన్స్‌లోని నివాసంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. మార్చి 28వ తేదీ వరకు కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో కేజ్రీవాల్ కింగ్‌పిన్‌గా వ్యవహరించారని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. సౌత్ గ్రూప్‌కు, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఆప్ మీడియా విభాగం ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్ వ్యవహరించారని ఛార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. దీని ద్వారా కేజ్రీవాల్ కోట్ల రూపాయలు ముడుపులు అందుకున్నారని కోర్టుకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment