
బీహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలిపోతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీహార్‌లో ఇటీవలి కాలంలో జూన్ 18న తొలి వంతెన కూలగా ఆ తరువాత కేవలం 17 రోజుల్లోనే 12కు పైగా వంతెనలు కుప్పకూలిపోయాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి బలహీనమైన వంతెనల విషయంలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
దేశంలో వంతెనలు కూలడమనేది ఒక్క బీహార్ మాత్రమే కాదు. ఇతర ప్రాంతాలలో కూడా వంతెనలు కూలుతుంటాయి. ఒక నివేదిక ప్రకారం 1977- 2017 మధ్య భారతదేశంలో 2,130 వంతెనలు కూలిపోయాయి. 2012- 2021 మధ్య 214 వంతెనలు కూలిపోయినట్లు ప్రభుత్వ రికార్డులలో నమోదయ్యింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదిక ప్రకారం ఇటీవలి కాలంలో వంతెనల కూలిన కేసులు తక్కువగా నమోదయ్యాయి. 2012- 2013 మధ్య సగటున 45 వంతెనలు కుప్పకూలగా, ఆ సంఖ్య 2021లో ఎనిమిదికి తగ్గింది.
సంవత్సరం | కూలిన వంతెనలు |
---|---|
2012 | 45 |
2013 | 45 |
2014 | 16 |
2015 | 22 |
2016 | 19 |
2017 | 10 |
2018 | 17 |
2019 | 23 |
2020 | 9 |
2021 | 8 |
వంతెనలు కూలిపోవడానికి కారణం
వంతెనలు కూలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంతెనల డిజైన్, ఉపయోగించిన మెటీరియల్, ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోవడం మొదలైనవి వీటిలో ప్రధాన కారణాలు. వంతెనలు కూలడానికి ప్రకృతి వైపరీత్యాలు కూడా ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇండియా టుడే నివేదిక ప్రకారం ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో 80కి పైగా వంతెనలు కూలిపోయాయి. 2012 నుంచి 2021 వరకు వంతెనలు కూలిన ప్రమాదాలలో 285 మంది మృతి చెందారు. 2022లో గుజరాత్‌లోని మోర్బీలో వంతెన కూలిపోవడంతో 141 మంది మృతి చెందారు.
సంవత్సరం మృతుల సంఖ్య
2013 53
2014 12
2015 24
2016 47
2017 10
2018 34
2019 26
2020 10
2021 5