న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలకు తెరపడటం లేదు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు సుమారు 50 విమానాల్లో బాంబులు పెట్టామంటూ ఆగంతకులు సోషల్ మీడియా ద్వారా బెదిరించారు. ఇందులో ఎయిరిండియా, ఇండిగోకు చెందిన 13 చొప్పున విమానాలు, ఆకాశ ఎయిర్‌కు చెందిన 12, విస్తార విమానాలు 11 ఉన్నాయి. బెదిరింపుల నేపథ్యంలో సోమవారం రాత్రి ఇండిగో తన మూడు సర్వీసులను సౌదీ అరేబియా, ఖతార్‌లకు మళ్లించాల్సి వచ్చింది. అయితే, ఇవన్నీ వట్టివేనని తేలింది.
తాజా ఘటనతో కలిపి 9 రోజుల్లో 170కి పైగా విమాన సర్వీసులకు బెదిరింపులు అందినట్లయింది. బాంబు హెచ్చరికల కారణంగా బెంగళూరు–జెడ్డా సర్వీసును దోహా(ఖతార్)కు, కోజికోడ్–జెడ్డా విమానాన్ని రియాద్(సౌదీ అరేబియా)కు, ఢిల్లీ–జెడ్డా సర్వీసును మదీనా(సౌదీ అరేబియా)కు మళ్లించామని ఇండిగో తెలిపింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా దించి వేసి, విమానంలో పూర్తి స్థాయిలో తనిఖీలు జరిపామని వివరించింది. ఢిల్లీ–దమ్మమ్, ఇస్తాంబుల్–ముంబై, ఇస్తాంబుల్–ఢిల్లీ, మంగళూరు–ముంబై, అహ్మదాబాద్–జెడ్డా, హైదరాబాద్–జెడ్డా, లక్నో–పుణే విమానాలకు కూడా బాంబు హెచ్చరికలు అందాయని ఇండిగో వెల్లడించింది. అయితే, ఎయిరిండియా తమ విమాన సర్వీసులకు అందిన బాంబు బెదిరింపులపై ఎటువంటి ప్రకటన చేయలేదు.
సోషల్ మీడియా ద్వారా తమ విమానాలకు కూడా బెదిరింపులు వచ్చాయని విస్తార ప్రతినిధి చెప్పారు. మిగతా వివరాలను ఆయన తెలపలేదు. బాంబు బెదిరింపులు వట్టివేనని తెలిసినా, ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. 1982 నాటి సప్రెషన్ ఆఫ్ అన్ లాఫుల్ యాక్ట్స్ ఎగెనెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్(ఎస్‌యూఏఎస్‌సీఏ)కు సవరణలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీని ప్రకారం బెదిరింపులకు పాల్పడే వారిని కోర్టు ఉత్తర్వులతో పనిలేకుండానే వెంటనే అరెస్ట్ చేసి, విచారణ చేపట్టేందుకు అవకాశమేర్పడుతుంది. అలాగే, దోషులకు కఠిన శిక్షలు పడేలా విమాన భద్రతా నిబంధనలను మార్చాలని కూడా కేంద్రం భావిస్తోంది.
9 రోజుల్లో రూ.600 కోట్ల నష్టం
తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న బాంబు బెదిరింపుల కారణంగా విమానయాన సంస్థలకు రూ.600 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని విమానయాన సంస్థల మాజీ అధికారులు అంటున్నారు. దేశీయ విమానాలకైతే నష్టం సుమారుగా రూ.1.5 కోట్ల చొప్పున, అంతర్జాతీయ సర్వీసులకైతే రూ.5 కోట్ల నుంచి రూ.5.5 కోట్ల వరకు నష్టం ఉంటుందని చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ విమానాలకు కలిపి సగటున రూ.3.5 కోట్ల మేర నష్టం ఉంటుందని, ఈ లెక్కన 170 విమానాలకు కలిపి ఈ నష్టం రూ.600 కోట్ల వరకు ఉంటుందని వారు అంచనా వేశారు. ఎయిర్ పోర్టులో పార్కింగ్ చార్జీలు, ఇంధనం వంటి ప్రత్యక్ష ఖర్చులతోపాటు ఇతర విమానాల షెడ్యూళ్లపై పడే పరోక్ష ప్రభావాన్ని కూడా లెక్కించాల్సి ఉంటుందన్నారు. ఇందులో చిన్న, పెద్ద విమానాలు, వాటి ప్రయాణ వ్యవధిని బట్టి కూడా నష్టం వేర్వేరుగా ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment