![Parliament Winter session 2023 likely to commence 2nd week of Dec - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/8/Parliament_Winter_Session.jpg.webp?itok=sdZjwjNG)
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు చెల్లుచీటి ఇస్తూ.. వాటి స్థానంలో కొత్త చట్టాలను తేవాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ శీతాకాల సమావేశాల్లో ఈ చట్టాల బిల్లులతో పాటు పెండింగ్‌లో ఉన్న మరో వివాదాస్పద బిల్లును సైతం పరిశీలించే యోచనలో ఉంది కేంద్రం.
మొత్తం 12 రోజులపాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు కాబోతున్నట్లు సమాచారం. అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ముగిశాకనే ఈ సమావేశాలు మొదలుకానున్నాయి. క్రిస్మస్‌లోపు.. అదీ డిసెంబర్ 22 లోపే సమావేశాలు ముగించేయలని భావిస్తోంది కేంద్రం. దీంతో రెండు వారం నుంచి సెషన్ నిర్వహించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, CRPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ఎవిడెన్స్ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య చట్టం తీసుకురావాలనుకుంటోంది కేంద్రం. ఇప్పటికే వీటిని కేంద్ర హోంశాఖ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఎలక్షన్ కమీషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును గత వర్షాకాల సమావేశాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసినా విపక్షాల, మాజీ ఎన్నికల కమీషనర్ల వ్యతిరేకతతో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది.
చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఎలక్షన్ కమీషనర్ల హోదాను కేబినెట్ కార్యదర్శికి సమానంగా తీసుకురావాలనేది ఈ బిల్లు ఉద్దేశ్యం. దాంతోపాటు ఎన్నికల కమీషనర్ల నియామక విధానంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కమీషనర్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా ఉంది. ఈ బిల్లు ఆమోదిస్తే కేబినెట్ సెక్రటరీ హోదా లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment