
కదులుతున్న ట్రైన్‌లో మంటలు చెలరేగుతున్నాయనే అకతాయిలు చేసిన పుకార్లు ప్రయాణికులు ప్రాణాల మీదకు తెచ్చాయి. ఉత్తరప్రదేశ్ బిల్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్లు ప్రయాణిస్తున్న ట్రైన్‌లో మంటలు చెలరేగుతున్నాయని పుకార్లు వ్యాపించాయి. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు కదులుతున్న ట్రైన్ నుంచి బయటకు దూకారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు.
మొరాదాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చే బిల్పూర్ స్టేషన్ సమీపంలోని హౌరా-అమృత్‌సర్ మెయిల్ జనరల్ కోచ్‌లో ఈ సంఘటన జరిగింది . గాయపడిన వారిని అన్వారీ (26), అఖ్తరీ (45), కుల్దీప్ (26), రూబీ లాల్ (50), శివ శరణ్ (40), చంద్రపాల్ (35)లుగా గుర్తించారు. ఆరుగురు ప్రయాణికులను షాజహాన్‌పూర్ మెడికల్ కాలేజీలో చేర్చినట్లు జీఆర్‌పీ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రెహాన్ ఖాన్ వెల్లడించారు.
రైల్వే స్టేషన్‌లో గందరగోళం
రైలు బరేలీలోని బిల్పూర్ స్టేషన్‌కు చేరుకోగానే గందరగోళం నెలకొంది. రైలులో మంటలు చెలరేగిపోయాయనే పుకారుతో ప్రయాణికులు ఆందోళనకు గురైరయ్యారు. భయాందోళనతో ట్రైన్ చైన్ లాగారు. చాలా మంది ప్రయాణికులు ఇంకా కదులుతున్న రైలు నుండి దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు.
రైల్లో చోటు చేసుకున్న ఘటనపై రెహాన్ ఖాన్ మాట్లాడుతూ.. కొంతమంది ఆకతాయిలు గాల్లో మంటలు వ్యాపించాయనే పుకార్లు పుట్టించినట్లు మా దృష్టికి వచ్చింది. పుకార్లు చేసిన అనంతరం ట్రైన్ చైన్ లాగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment