న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సిద్ధాంతాలతో పశ్చిమ బెంగాల్‌ను నాశనం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాల కోసం 70 లక్షల మంది రైతులకు పీఎం- కిసాన్ యోజన ఫలాలు అందకుండా చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద తొమ్మిది కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరేలా రూ. 18 వేల కోట్ల నిధులను నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బెంగాల్‌లో నిరసనలు వ్యక్తమవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
‘‘చిన్న, సన్నకారు రైతులకు లబ్ది చేకూర్చే పీఎం- కిసాన్ పథకాన్ని బెంగాల్‌లో అమలు చేయడం లేదు. అర్హులైన రైతులు ఒక్కొక్కరికి 2 వేల రూపాయల మేర.. మొత్తంగా రూ. 6 వేల కోట్లు విడుదల చేస్తున్నాం. వాటిని నేరుగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫలాలు వారికి చేరకుండా చేస్తోంది. అప్పుడు ఆందోళనలు జరగలేదు. కానీ ఇప్పుడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తున్నారు. దేశమంతా ఈ పథకం వల్ల లబ్ది పొందుతోంది.
కానీ ఒక్క పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే రాజకీయాల కోసం అర్హులైన రైతులకు నష్టం వాటిల్లుతోంది. సీఎం మమత 15 ఏళ్ల క్రితం చేసిన ప్రసంగాన్ని ఓ సారి పరిశీలిస్తే.. ఆమె సిద్ధాంతం బెంగాల్‌ను ఎంతగా నాశనం పట్టించిందో అర్థమవుతుంది. ఈ స్వార్థ రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. సొంత రాష్ట్రంలో రైతులను పట్టించుకోని వారు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పేరిట ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న వారికి మాత్రం మద్దతు పలుకుతున్నారు’’ అని ప్రధాని మోదీ మమతా బెనర్జీ సర్కారు తీరును విమర్శించారు. కాగా బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, అధికార టీఎంసీ మధ్య మాటల యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.(చదవండి: మనకున్న అతిపెద్ద బలం అదే: ప్రధాని మోదీ)
Comments
Please login to add a commentAdd a comment