న్యూఢిల్లీ: జీ7 అత్యాధునిక ఆర్థిక వ్యవస్థల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం జీ7 సదస్సుకు ఆతిథ్యమిస్తున్న ఇటలీకి గురువారం ప్రధాని మోదీ బయల్దేరనున్నారు. మూడోసారి ప్రధానిగా పగ్గాలు స్వీకరించాక మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదేకావడం విశేషం. గత ఏడాది భారత సారథ్యంలో ముగిసిన జీ20 శిఖరాగ్ర సమావేశాల తర్వాత జరుగుతున్న సదస్సు కావడంతో ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఇటలీలోని అపూలియో ప్రాంతంలోని విలాసవంత బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు జూన్ 13వ తేదీ నుంచి 15వ తేదీదాకా జరగనుంది. ఉక్రెయిన్ యుద్ధంతోపాటు ఇజ్రాయెల్ దాడులతో శిథిలమవుతున్న గాజా స్ట్రిప్‌ను ఆదుకునేందుకు, యుద్ధాలను ఆపేందుకు అధినేతలు సమాలోచనలు జరపనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలానీ తదితర అగ్రనేతలు ఈ భేటీకి హాజరవుతున్నారు.
రష్యా భీకర దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ సైతం ఒక సెషన్‌లో పాల్గొని రష్యాపై విమర్శల వర్షం కురిపించనున్నారు. మోదీ విదేశీ పర్యటన వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా వెల్లడించారు. ‘‘ చర్చలు, సంప్రతింపుల ప్రక్రియ ద్వారా ఉక్రెయిన్, హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాలకు ముగింపు పలికేందుకు భారత్ ఎప్పటిలాగే సదా సిద్ధంగా ఉంది’ అని ఖ్వాత్రా చెప్పారు. స్విట్జర్లాండ్‌లో జరగబోయే శాంతి సదస్సులోనూ భారత్ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. అయితే భారత్ తరఫున ఎవరు హాజరవుతారనే వివరాలను ఆయన వెల్లడించలేదు.
గాందీజీ ప్రతిమ వద్ద ఖలిస్తానీ రాతలు
ఇటలీలో మోదీ గురువారం పర్యటన మొదలుకానున్న ఒక్క రోజు ముందే అక్కడి గాంధీజీ ప్రతిమ వద్ద ఖలిస్తానీ మద్దతుదారులు వేర్పాటువాద రాతలు రాశారు. కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ అనుకూల నినాదాలనూ ప్రతిమ పీఠం వద్ద నలుపురంగుతో రాశారు. ప్రతిమను ఆవిష్కరించిన కొద్దిసేపటికే వేర్పాటువాదులు ఈ చర్యలకు తెగబడ్డారు. వేర్పాటువాదుల దుశ్చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. తగిన చర్యలు తీసుకోవాలని ఇటలీ అధికారులకు సూచించామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా చెప్పారు. వెంటనే స్థానిక యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని ఖలిస్తానీ రాతలను తుడిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment