
సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఇన్‌చార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కాంగ్రెస్ పతానంతరం కొత్తగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గవర్నర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్.రంగస్వామి బీజేపీ అగ్రనేతలతో రహస్య చర్చలు జరిపి, ప్రభుత్వం ఏర్పాటుకు తాము సుముఖంగా లేమని తెలియజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్షం కూడా వెనక్కి తగ్గడంతో పుదుచ్చేరీలో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. 14 మంది సభ్యుల బలం వున్న ప్రతిపక్షం ప్రభుత్వ ఏ ర్పాటుకు నిరాకరించింది. గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు.కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడగానే పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది.
సీఎం, కేబినెట్ రాజీనామా ఆమోదం
పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి, ఆయన మంత్రివర్గం రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంగళవారం వెల్లడించింది. రాజీనామాల ఆమోదం సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. అసెంబ్లీలో బల నిరూపణ కంటే ముందే సీఎం, ఆయన మంత్రివర్గం సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.